వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం పూర్తి చేస్తానంటూ సవాళ్లు చేసిన అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారని.. ఇప్పుడు మాత్రం తనకు సంబంధం లేదని అంటున్నారని లోకేష్ విమర్శించారు. 

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా నిబంధనల ఉల్లంఘనపై నమోదైన కేసులో లోకేష్ విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. 55 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. అందులో ఒక్క కేసు కూడా నిరూపించే పరిస్థితి లేదన్నారు. తనపై ఈ ప్రభుత్వం ఎన్నో ఆరోపణలు చేసిందని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలకు తాను చర్చరకు సిద్దంగా ఉన్నానని వెల్లడించారు. ఇప్పుడు కోవిడ్ కేసు పెట్టారని అన్నారు. తనపై ఇప్పటికే 14కేసులు పెట్టారని.. మరో 10కేసులు పెట్టుకున్నా ఏమి చేయలేరని అన్నారు.

పోలవరం పూర్తి చేస్తానంటూ సవాళ్లు చేసిన అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారని.. ఇప్పుడు మాత్రం తనకు సంబంధం లేదని అంటున్నారని లోకేష్ విమర్శించారు. సీఎం జగన్ దావోస్ పర్యటన వైసీపీ పొలిట్ బ్యూరో సమావేశంలా ఉందని ఎద్దేవా చేశారు. దావోస్‌లో పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని అడిగితే దావోస్‌లో ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అదానీని కలిసేందుకు దావోస్ దాకా వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన అదానీ కలుస్తారని ఎద్దేవా చేశారు. 

దావోస్ వెళ్లేందుకు ప్రత్యేక విమానం కోసమే రూ. 8 కోట్లు ఖర్చు చేశారని లోకేష్ ఆరోపించారు. నేరుగా దావోస్‌కు వెళ్లకుండా లండన్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సీఎం జగన్ దేశం వదిలి వెళ్లాక పెట్రోల్ ధరలు తగ్గాయన్నారు. మూడేళ్ల సినిమా అయిపోయిందని.. జగన్ ఇక ఇంటికే అని అన్నారు. ప్రజలను ధరలు, పన్నుల పేరుతో పీడించి నరకం చూపించారని ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. తప్పు చేయలేదు కాబట్టే కోర్టుకు వచ్చానని చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలు ఉల్లంఘించి దొంగ కేసులు పెడతారా అని మండిపడ్డారు. 

Also Read: హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబానికి టీడీపీ ఆర్థిక సాయం

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. సుబ్రహ్మణ్యం హత్యకు గురై 72 గంటలైనా నిందితులను పట్టుకోలేరా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నామని అన్నారు. 24 గంట్లో అనంతబాబును పట్టుకోకపోతే ఉద్యమిస్తామని చెప్పారు. సుబ్రహ్మణ్యం హత్య తర్వాత ఎమ్మెల్సీ అన్ని చోట్లకు వెళ్లారని లోకేష్ చెప్పారు. అనంతబాబు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిలను కూడా కలిశారని అన్నారు. పోలీసులకు మాత్రం అనంతబాబు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.