వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) మజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం ప్రకటించింది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంత బాబు) మజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం అందజేసేందుకు ముందుకు వచ్చింది. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటికీ అరెస్ట్ చెయ్యక పోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిందితుల అరెస్ట్ కోసం దళిత సంఘాలతో కలిసి తదుపరి కార్యాచరణకు టీడీపీ సిద్ధమవుతోంది.
ఇక, సుబ్రహ్మణ్యం భార్య అపర్ణను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం ఫోన్‌లో పరామర్శించారు. అనంతబాబే తన భర్తను హత్య చేశాడని, టీడీపీతో పాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లే పోలీసులు చివరికి హత్య కేసుగా నమోదు చేశారని అపర్ణ చెప్పారు. తనను పోలీసులు తీవ్రంగా వేధించారని...ప్రభుత్వం తనను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు.
ఈ క్రమంలోనే అపర్ణకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులకు శిక్ష పడేవరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బహిరంగంగా తిరుగుతున్న ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ, దళిత సంఘాల పోరాటం వల్లే.. సుబ్రమణ్యం మృతిని హత్య కేసుగా నమోదు చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సుబ్రమణ్యం భార్య అపర్ణ కోరుతున్నారని ఆయన తెలిపారు.
