బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని తిరుమల శ్రీవారిపై ప్రమాణం చేయాలని సీఎం వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు నారా లోకేష్. లేదంటే బాబాయ్‌పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా అంటూ ఆయన ప్రశ్నించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. సీఎం తిరుమల టూర్‌ను టార్గెట్ చేస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో తనకు , తన కుటుంబానికి సంబంధం లేదని 14.04.21న తిరుమలలో తాను ప్రమాణం చేశానని లోకేష్ గుర్తుచేశారు. ఇప్పుడు మీ బాబాయ్ హత్యతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని ప్రమాణం చేస్తారా అని జగన్‌కు ఆయన సవాల్ విసిరారు. లేదంటే బాబాయ్‌పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా అంటూ లోకేశ్ ప్రశ్నించారు. ఈ మేరకు నారా లోకేష్ మంగళవారం ట్వీట్ చేశారు.
ఇకపోతే.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు సీఎం వైఎస్ జగన్. మధ్యాహ్నం 3:45 గంటలకు ఆయన గన్నవరం నుండి రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారు. సాయంత్రం ఐదున్నర గంటలకు తిరుపతిలోని గంగమ్మ తల్లి ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలిపిరిలో విద్యుత్ బస్సులను సీఎం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత రాత్రి 07:45 గంటలకు బేడి ఆంజనేయస్వామిని జగన్ దర్శించుకొంటారు. అక్కడి నుండి నేరుగా తిరుమలకు చేరుకుని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు ముఖ్యమంత్రి.
ALso Read:వెంకన్న బ్రహ్మోత్సవాలు: రేపు తిరుమలకు ఏపీ సీఎం జగన్, పట్టు వస్త్రాలు సమర్పణ
ఈ నెల 28వ తేదీ ఉదయం సీఎం జగన్ స్వామి వారిని దర్శించుకుంటారు. తిరుమలలో పరకామణి భవనంతో పాటు లక్ష్మీవీపీఆర్ రెస్ట్ హౌస్ ను ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 8:45 గంటలకు సీఎం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి ఆయన ఓర్వకల్లు కు వెళ్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం ప్రయాణం చేసే మార్గంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
