ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టిడిపి నేత నన్నూరి నర్సిరెడ్డి సంచలన ఆరోపణలు చేసారు.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పై టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. స్పీకర్ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు నకిలీవని... అసలు డిగ్రీ పూర్తిచేయకుండానే లా చేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నకిలీ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయో... వాటిని ఎవరు ఇచ్చారో స్పీకర్ వెల్లడించాలని నర్సిరెడ్డి డిమాండ్ చేసారు.
సమాచార హక్కు చట్టం ద్వారా మహాత్మాగాంధీ లా కాలేజీలో స్పీకర్ తమ్మినేని సమర్పించిన సర్టిఫికెట్లను పొందినట్లు నర్సిరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ స్టడీ సెంటర్ నుండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 2015-18 విద్యాసంవత్సరంలో తమ్మినేని బీకాం డిగ్రీ చదవినట్లు సర్టిఫికెట్స్ లో వుందన్నారు. అయితే అసలు తమ్మినేని సీతారం డిగ్రీ చదివినట్లు నాగర్ కర్నూల్ స్టడి సెంటర్ లోని ఏ రికార్డుల్లో లేదని తమ విచారణలో తేలినట్లు నర్సిరెడ్డి తెలిపారు.

స్పీకర్ తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ ద్వారా లా కాలేజీలో అడ్మిషన్ పొందారని స్పష్టంగా అర్థమవుతోందని నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి స.హ చట్టం ద్వారా పొందిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కాపీలను నర్సిరెడ్డి మీడియా సభ్యులకు అందజేసారు.
Read More పీకే స్కెచ్ వేస్తున్నాడు .. షర్మిల, విజయమ్మలను చంపేస్తారు : డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇదిలావుంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎడ్యుకేషన్ సర్టిపికెట్స్ పైనా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని డిగ్రీ,పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవి కావచ్చని డిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రస్తుతం దేశానికి చదువుకున్న ప్రధాని అవసరమని... ఒక ప్రధాని ఒక్క రోజులో వందల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రధానికి చదువు లేకపోతే ఆయన చుట్టూ ఉన్న అధికారులు ఆయనను ప్రభావితం చేస్తారని కేజ్రీవాల్ అన్నారు.
ఇక డిగ్రీ సరిఫ్టికేట్ల విషయంలో ప్రధాని మోదీ టార్గెట్‌గా బీఆర్ఎస్ నేతలు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ‘నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా’ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ఇటీవల ట్వీట్ చేశారు. తాను పుణె యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో బిజినెస్‌లో మాస్టర్ డిగ్రీ చేసినట్టు పేర్కొన్నారు. ఇలా ప్రధాని డిగ్రీపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ సంచలనంగా మారింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా పరోక్షంగా మోదీ విద్యార్హతలపై విమర్శలు చేసారు. భారతదేశంలో నిజమైన డిగ్రీలు ఉన్నవారికి ఉద్యోగం రాదని.. డిగ్రీలు లేనివారికి ఉన్నత ఉద్యోగం ఉందంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి కామెంట్స్ చేసారు.
