బాపట్ల జిల్లా ఐలవరం గ్రామంలో వైసిపి ఉపసర్పంచ్ చేతిలో గాయపడ్డి టిడిపి కార్యకర్తను మాజీ మంత్రి ఆనంద్ బాబు పరామర్శించారు.
గుంటూరు : అధికారం వుందికదా అని వైసిపి వాళ్లు కండకావరంతో కొట్టుకుంటున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకు వైసిపి నాయకులంతా ఒకేదారిలో నడుస్తున్నారని... పోలీసులు వారికి ఊడిగం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష టిడిపి నాయకులు, కార్యకర్తలతో వైసీపీ నేతలు దాడిచేయడం నిత్యకృత్యం అయ్యిందని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తంచేసారు.
బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో టిడిపి కార్యకర్త శ్రీరామ్ నాగేంద్రబాబు పై ఉపసర్పంచ్ పప్పల వెంకటేశ్వర్లు హత్యాయత్నానికి పాల్పడటంపై ఆనంద్ బాబు స్పందించారు. వైసిపికి చెందిన ఉపసర్పంచ్ గొడ్డలితో నరికి చంపడానికి ప్రయత్నించగా తీవ్ర గాయాలతో అతడు బయటపడ్డాడు. గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతున్న నాగేంద్రబాబును టిడిపి నాయకులతో కలిసి పరామర్శించారు ఆనంద్ బాబు.
వైసిపి నాయకుడి దాడిలో గాయపడి హాస్పిటల్ పాలయిన నాగేంద్రబాబు కుటుంబాన్ని టిడిపి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆనంద్ బాబు హామీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్త కుటుంబానికి అండగా వుండటం తమ బాధ్యత అని అన్నారు. జిజిహెచ్ డాక్టర్ తో మాట్లాడిన ఆనంద్ బాబు గాయపడిన నాగేంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
Read More ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు.. హైకమాండ్‌కు తలనొప్పులు
ఈ సందర్భంగా ఆనంద బాబు మాట్లాడుతూ... ఇటీవలే చెరుకుపల్లిలో పదో తరగతి విద్యార్థి పై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన మరువకముందే మరో దారుణం చోటుచేసుకుందని అన్నారు. ఐలవరంలో వైసిపి నేత వెంకటేశ్వర్లు టిడిపి దళిత కార్యకర్త నాగేంద్రబాబు గొడ్డలితో దాడి చేసాడని అన్నారు. నాగేంద్ర టిడిపి కోసం పనిచేస్తుండటంతోనే కక్ష్యగట్టి దాడి చేసారన్నారు. ప్రస్తుతం నాగేంద్ర పరిస్థితి విషమంగా ఉందని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు.
ఏపీలో దళితులపై వైసిపి నాయకుల దాడులు నిత్యకృత్యంగా మారాయని... అయినా పోలీసులు వైసిపి ఏజెంట్స్ లా పనిచేస్తున్నారని మాజీ మంత్రి మంత్రి ఆరోపించారు. నాగేంద్రబాబుపై ఇంత దారుణంగా దాడి జరిగినా స్దానిక పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. ఎస్సి యువకుడిపై దాడి చేయడం దారుణమని అన్నారు.
టిడిపి నాయకులపై దాడులకు తెగబడుతున్న వైసీపీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోండి... త్వరలోనే మీ అక్రమాలకు,దౌర్జన్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆనంద్ బాబు హెచ్చరించారు. వైసిపి నాయకులు ఇకనైనా టిడిపి వాళ్ల జోలికి రావద్దని మాజీ మంత్రి ఆనంద్ బాబు హెచ్చరించారు.
