ఉమ్మడి అనంతపురం జిల్లాలో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర సాక్షిగా తెలుగుదేశం పార్టీ నేతలు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పెనుగొండ, మడకశిర నియోజకవర్గాల్లో నేతలు బాహాబాహీకి దిగుతున్నారు.
త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని కలవరపెడుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర సాక్షిగా తెలుగుదేశం పార్టీ నేతలు మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పెనుగొండలో నేతలు చొక్కాలు పట్టుకోగా, మడకశిరలో ఏకంగా యాత్రనే పక్కనపెట్టారు. పెనుగొండలో బీకే పార్థసారథి, సవితమ్మ గ్రూపుల మధ్య అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ నాకంటే నాకంటూ గొడవలు పడుతున్నారు. పార్థసారథి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వుండటంతో ఆయన తనకే టికెట్ దక్కుతుందని నమ్మకంగా చెబుతున్నారు.
ఇక మడకశిర విషయానికి వస్తే.. మాజీ ఎమ్మెల్యే ఈరన్న , మరో నేత గుండుమల తిప్పేస్వామి వర్గీయుల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈరన్న వర్గం యాత్రలో పాల్గొంటే తాము పాల్గొనబోమని తిప్పేస్వామి వర్గీయులు తేల్చిచెప్పారు. అంతేకాదు.. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు.
