Asianet News TeluguAsianet News Telugu

జగన్ అండదండలున్నా... అలా చేస్తే కోర్టు బోనెక్కక తప్పదు: అధికారులు మాజీ మంత్రి హెచ్చరిక

టిటిడి ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి కుమారుడి స్నేహితుడు లవ్ కుమార్ రెడ్డి  విశాఖపట్నం-తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నాడని మాజీ మంత్రి ఆనంద్ బాబు ఆరోపించారు. 

tdp leader nakka anand babu warning to government officers akp
Author
Amaravati, First Published Jul 21, 2021, 2:17 PM IST

విశాఖపట్నం-తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ప్రభుత్వపెద్దల అండదండలతో కొందరు లాటరైట్ ముసుగులో బాక్సైట్ ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. ఆ వ్యవహారంపై గిరిజనులకు మద్ధతుగా టీడీపీ వివిధ రకాల పద్ధతుల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. 

''తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో మైనింగ్ జరిగిందని వైసిపి ఎమ్మెల్యే ఈ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మైనింగ్ కు అనుమతులిచ్చింది తప్ప టీడీపీ ఏనాడూ ఎవరికీ అనుమతులుఇవ్వడం గానీ, మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడం గానీ చేయలేదని గుర్తించాలి. జరుగుతున్న మైనింగ్ ను కూడా చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాకే ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆయన బంధువులే మన్యంపై పడి విలువైన ఖనిజ సంపదను లూఠీ చేస్తున్నారు'' అని ఆనంద్ బాబు మండి పడ్డారు. 

''టిటిడి ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి కుమారుడి స్నేహితుడు లవ్ కుమార్ రెడ్డి అక్కడే ఉండి స్వయంగా మైనింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిస్తున్నాడు. టీడీపీ ఆధ్వర్యంలోని నిజ నిర్ధారణ కమిటీ బృందం మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించింది. మైనింగ్ కోసం నరికిన చెట్లను, ఖనిజ రవాణా కోసం వేసిన రోడ్డుని, గిరిజనులు అనుభవిస్తున్న నరకయాతనను తాము కళ్లారా చూడటం జరిగింది. మైనింగ్ ప్రాంతాలన్నీ పరిశీలించి తిరిగివచ్చేటప్పుడు తమను పోలీసులు అడ్డుకున్నారు... వెళ్లేటప్పుడు అడ్డగించని పోలీసులు తిరిగి వచ్చేవారిని ఆపడం ఏమిటి'' అని మాజీమంత్రి ప్రశ్నించారు. 

''మేము చూసిన వాస్తవాలను ప్రజలకు తెలియచేయడానికి ప్రెస్  మీట్ నిర్వహించాలని భావిస్తే, అవేమీ చేయడానికి వీల్లేదని పోలీసులు నిలువరించారు. మీడియాతో మాట్లాడినా, అక్కడున్నా కేసులుపెడతామని తమను పోలీసులు బెదిరించారు. వాస్తవాలు బయటకు వస్తాయని ఈ ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఎందుకంతలా భయపడుతున్నారు'' అని ఆనంద్ బాబు నిలదీశారు. 

read more  కుర్చీల్లేని పదవులు బలహీనవర్గాలకా..? ఇదెక్కడి సామాజికన్యాయం..: జగన్ పై అచ్చెన్న ఆగ్రహం

''మైనింగ్ పేరుతో పర్యావరణానికి తలపెట్టిన ముప్పుపై, అడ్డూ ఆపులేకుండా సాగుతున్న మైనింగ్ పై, గిరిజనుల ఉనికికే హానికలిగేలా సాగుతున్న చర్యలపై,  కేంద్రపర్యావరణ శాఖకు, జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. రిజర్వ్ ఫారెస్ట్ ను రోడ్డుకోసం దారుణంగా నరికేశారు. గిరిజన తండాలకు రోడ్లువేసే నెపంతో ఎన్ఆర్ ఈజీఎస్ నిధులను దుర్వినియోగం చేశారు. భారీ యంత్రాలతో భారీ రోడ్లు వేశారు. ఇంత జరుగుతున్నా కేంద్ర అటవీశాఖ అధికారులు, పర్యావరణ విభాగం వారు ఏం చేస్తున్నారు'' అని మాజీమంత్రి నిలదీశారు. 

''వేలకోట్ల విలువైన ఖనిజ సంపదను తూర్పు గోదావరి నుంచి కడపకు భారీ లారీల్లో తరలిస్తున్నా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ది ఫారెస్ట్ అధికారి ఏం చేస్తున్నాడు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, అడ్డగోలుగా సాగిస్తున్న ఖనిజ సంపద లూఠీ వ్యవహారంలో అన్నివిభాగాల అధికారుల  ప్రమేయం ఉందని తమకు అనిపిస్తోంది. కింది స్థాయిలో ఉన్న అధికారులంతా అక్రమ మైనింగ్ లో కుమ్మక్కవ్వబట్టే అక్కడ జరిగే దోపిడీ వివరాలు బయటి ప్రపంచానికి తెలియడం లేదు. అధికారులు నేడు ముఖ్యమంత్రి అండదండలతో దోపిడీకి సహకరించినా రేపు కచ్చితంగా కోర్టుబోనులో నిలబడి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది'' అని మాజీ మంత్రిహెచ్చరించారు. 

'' అటవీశాఖ అధికారులు, పర్యావరణ విభాగంవారు, రాష్ట్రస్థాయి అధికారులు కచ్చితంగా న్యాయస్థానాలకు సమాధానం చెప్పేవరకు తాము అక్రమ మైనింగ్ పై పోరాడుతాం. పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ద్వివేది తానే ప్రభుత్వమైనట్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కంచె చేను మేసినట్లు, అటవీ సంపదను, గిరిజనులను కాపాడాల్సిన ప్రభుత్వమే రూ. 15వేలకోట్ల విలువైన ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు.  యధేచ్ఛగా సాగుతున్న మైనింగ్ ను అధికారులు నిలువరించకపోతే ప్రతిఒక్కరూ మూల్యంచెల్లించుకోక తప్పదు'' అని మాజీమంత్రి ఆనంద్ బాబు హెచ్చరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios