Asianet News TeluguAsianet News Telugu

కుర్చీల్లేని పదవులు బలహీనవర్గాలకా..? ఇదెక్కడి సామాజికన్యాయం..: జగన్ పై అచ్చెన్న ఆగ్రహం

నామినేెటెడ్ పదవుల భర్తీ విషయంలో సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని పాటించలేదు... తన సొంత సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేసుకున్నాడని టిడిపి నాయకులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

AP TDP President Atchannaidu Serious on CM YS Jagan akp
Author
Amaravati, First Published Jul 21, 2021, 10:16 AM IST

అమరావతి: వైసీపీలోని రాజకీయ నిరుద్యోగులకు, తన సామాజిక వర్గంలోని వారికి పదవులు కట్టబెట్టడంపై సీఎం జగన్ రెడ్డికి ఉన్న శ్రద్ధ విద్యావంతులైన నిరుద్యోగులపై లేదని ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రుల్ని సీఎం డమ్మీల్ని చేశారు... స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా చేశారన్నారు. తాజాగా నామినేటెడ్ పదవుల కేటాయింపులోనూ అదే వివక్ష చూపించారని అచ్చెన్న మండిపడ్డారు. 

''నిధులు, అధికారాలు ఉన్న పదవుల్ని సొంత వారికి కట్టబెట్టిన జగన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు కనీసం కుర్చీ కూడా లేని ఛైర్మన్ పదవుల్ని కేటాయించారు. రాష్ట్ర స్థాయి కీలక పదవుల్లో సింహభాగం తన సొంత సామాజిక వర్గంతో నింపుకోవడమే సామాజిక న్యాయం చేయడమా.?'' అని ముఖ్యమంత్రిని నిలదీశారు. 

''స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లులో కోతపెట్టి 16,800 మందికి రాజకీయ అవకాశాలను దెబ్బతీశారు. సబ్ ప్లాన్ నిధుల్లో కోత పెట్టారు. ఇళ్ల పట్టాల పేరుతో 10వేల ఎకరాలను బడుగుల అసైన్ మెంట్ భూముల్ని బలవంతంగా లాక్కున్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువత రిజర్వేషన్లు కోల్పోతున్నారు. బలహీన వర్గాలపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు తెగబడుతూ.. బడుగులకు రాష్ట్రంలో బతికే పరిస్థితి లేకుండా చేశారు'' అని అచ్చెన్న ఆరోపించారు. 

read more  మా కార్పోరేటర్ ఇంట్లోకి చొరబడి... మహిళలతో అంత నీచంగానా..: వైసిపి నేతలపై అచ్చెన్న ఫైర్

''కుల, మత, రాగద్వేషాలకు అతీతంగా పాలన కొనసాగిస్తానని ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన జగన్‌రెడ్డి... అడుగడుగునా బడుగు బలహీన వర్గాల అణచివేతే లక్ష్యంగా అధికారం చెలాయిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టీటీడీ, ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీఐఐసి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్, శాప్, ఇరిగేషన్ డెవలప్ మెంట్ బోర్డు వంటి కీలక పదవులను బడుగు బలహీన వర్గాలకు కేటాయిస్తే.. నేడు జగన్‌రెడ్డి ఆయా పదవులన్నింటినీ సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టి సామాజిక న్యాయం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు'' అని మండిపడ్డారు. 

''బడుగు బలహీన వర్గాలు స్వయం సమృద్ధి సాధించి తమ కాళ్లపై తాము నిలబడేలా తెలుగుదేశం కృషి చేస్తే.. వారంతా తమపై ఆధారపడేలా జగన్ రెడ్డి తయారు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారిని, సీట్లు దక్కలేదనే అసంతృప్తితో ఉన్నవారికి పదవులిచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు అభ్యున్నతి చెందకుండా.. అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు'' అన్నారు. 

''టీటీడీ ఛైర్మన్ గా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉండడానికి అర్హత లేదా.? బలహీనవర్గాలంటే ఎందుకంత విధ్వేషం జగన్ రెడ్డీ.? వెయ్యికి పైగా నామినేటెడ్‌ పదవులు, 49 సలహాదర్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల స్థానం ఎంత.? ఇదేనా బడుగు బలహీనవర్గాలను ఉద్దరించడం. తెలుగుదేశం ప్రభుత్వంలో సామాజిక న్యాయాన్ని కాపాడి, ఆయా వర్గాల పురోభివృద్ధికి తోడ్పడితే.. జగన్ రెడ్డి సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి సొంత సామాజిక వర్గాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్దుతున్నారు'' అని అచ్చెన్న ఆరోపించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios