ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్దమవుతున్నారని.... ఏ క్షణమైనా వైసిపి ప్రభుత్వం రద్దు కావచ్చని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమయ్యారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఏ క్షణమైనా వైసిపి ప్రభుత్వ రద్దు ప్రకటన వుంటుందని... నవంబర్ లేదా డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు వుండే అవకాశాలున్నాయని మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. కాబట్టి మరోసారి తప్పు జరగకుండా వైసిపిని ఓడించేందుకు టిడిపి క్యాడర్ సిద్దంగా వుండాలని ఆనంద్ బాబు సూచించారు. 

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి క్యాడర్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా వుండాలని సూచించారు. వైసిపి నాయకులు ధన బలం, అధికార బలంతో ఎన్నికలకు వెళితే టిడిపి ప్రజా బలంతో వెళ్లాలని... ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేయాలని అన్నారు. చంద్రబాబు నాయుడు తిరిగి సీఎం అయితేనే ఏపీ బాగుపడుతుందని ఆనంద్ బాబు అన్నారు. 

Read More సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి: చంద్రబాబుకు విజయసాయిరెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఇక విశాఖలో కాపురం పెడతానన్న ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఘాటుగా స్పందించారు. ఇప్పుడు విశాఖలో కాకపోతే నాలుగు చోట్ల కాపురాలు పెట్టుకొండి... ఎన్నికలు అయిపోయాక ఎక్కడ కాపురం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ప్రజలు ఈసారి వైసిపిని ఓడించి జగన్ ను రాష్ట్రంనుండే తరిమి కొట్టేందుకు సిద్దమయ్యారని... ఈ నాలుగైదు నెలలు ఎక్కడ కాపురం ఏముంది అంటూ ఆనంద్ బాబు ఎద్దేవా చేసారు. 

కనీసం ప్రభుత్వ పథకాలు సజావుగా అమలు చేయలేని దుస్థితికి ఏపీ ప్రభుత్వ పరిస్థితి దిగజారిందని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేసారు. అనుభవం లేని అవినీతి నాయకులకు నాయకులకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇలాగే వుంటుందన్నారు. కాబట్టి మరోసారి తప్పు జరక్కుండా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆనంద్ బాబు సూచించారు. 

ఇదిలావుంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇటీవల జరుగుతున్న పరిణామలపై ఆనంద్ బాబు స్పందించారు. సొంత కుటుంబసభ్యున్ని అతి దారుణంగా హతమార్చిన జగన్ కుటుంబంలో ఒక్కొక్కరు జైలుబాట పట్టారని అన్నారు. జగన్ ప్రభుత్వానికి చివరి ఘడియలు మొదలయ్యాయని అన్నారు. 

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ పై జరిగిన కోడికత్తి దాడిలో కుట్ర కోణం దాగివుందని స్పష్టంగా అర్ధమవుతోందని మాజీ మంత్రి అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఆ కుట్ర ఏమిటో ఎన్ఐఏ బయటపెట్టాలని కోరారు. కోడికత్తి నిందితుడు గత నాలుగు సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్నాడని ఆనంద్ బాబు తెలిపారు.