మాదిగల ఆత్మీయ సమ్మేళనం మాదిరిగానే త్వరలోనే మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. 

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాలల బాధవుడు అయితే ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మాలల ద్రోహి అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. ఈ నాలుగేళ్ల జగన్ రెడ్డి పాలనలో మాలలకు ఒరిగిందేమీ లేదన్నారు. కాబట్టి మాలల అభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మాజీ మంత్రి పేర్కొన్నారు. 

మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం మాదిరిగానే త్వరలోనే మాలల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆనంద్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని కులాలు, సామాజిక వర్గాల సాధికారత కోసం టిడిపి ప్రయత్నిస్తోందని అన్నారు. గతంతో టిడిపి ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్, చంద్రబాబు అభివృద్ది, సంక్షేమం రెండుకళ్ళలా భావించి పథకాలను అమలు చేసారని ఆనంద్ బాబు పేర్కొన్నారు. 

అధికారం కోసం మాలలకు మాయమాటలు చెప్పిన జగన్ ఎన్నికల తర్వాత మోసం చేసాడని ఆనంద్ బాబు అన్నారు. వైసిపి పాలనలో మాలల సంక్షేమం జరక్కపోగా వారిపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. గుంటూరులో రమ్య లాంటి అనేకమందిని జగన్ రెడ్డి ప్రభుత్వం పొట్టనపెట్టుకుందని మాజీ మంత్రి ఆరోపించారు. పెందుర్తి శ్రీకాంత్, దోమతోటి విక్రమ్, కావలి కరుణాకర్, చీరాల కిరణ్, చిత్తూరు ఓంప్రతాప్, కాకినాడ సుబ్రహ్మణ్యం... ఇలా ఎంతమందో వైసిపి పాలనలో బలయ్యారని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేసారు. 

Read More పొత్తులపై వైసిపి క్లారిటీ... మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

జగన్ రెడ్డి పాలనలో మాలలపై జరిగినన్ని దాడులు, హత్యలు, అఘాయిత్యాలు మరే పాలకుడి హయాంలో జరగలేదని ఆనంద్ బాబు ఆరోపించారు. చివరకు తనవద్ద డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను అతి దారుణంగా హత్యచేసిన ఎమ్మెల్సీ అనంత్ బాబుకు బెయిల్ ఇప్పించిన జగన్ పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయించారని అన్నారు. అలాగే గత టిడిపి ప్రభుత్వం 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహంతో పాటు అమరావతిలో 25 ఎకరాల్లో స్మృతివనం నిర్మించాలని నిర్ణయించిందని... కానీ వైసిపి ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లలేదని అన్నారు. ఇలా మాలలకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్న జగన్ ను తమ జాతి ఎన్నటికీ క్షమించదని ఆనంద్ బాబు పేర్కొన్నారు. 

మరోవైపు జస్టిస్ పున్నయ్య కమిటీ సూచించిన 42 సిఫారసులను యదాతదంగా ఆమోదించి వాటిని అమలుచేసిన పెద్దమాల చంద్రబాబు నాయుడని ఆనంద్ బాబు అన్నారు. అంబేద్కర్ కు భారత రత్న, బాలయోగికి లోక్ సభ స్పీకర్, ప్రతిభా భారతికి అసెంబ్లీ స్పీకర్ పదవులు దక్కడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారని అన్నారు. ఇలా గతంలో రాజకీయంగానే కాదు అన్నిరంగాల్లో మాలలకు ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు రానున్న టిడిపి ప్రభుత్వంలోనూ పెద్దపీట వేస్తారని ప్రజలు నమ్ముతున్నారని ఆనంద్ బాబు అన్నారు.