తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకునిపోతూ 2024 ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతుండగా వైసిపి మాత్రం ఒంటరిగానే పోటీకి సై అంటోంది.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో అప్పుడే ఎలక్షన్ హీట్ మొదలయ్యింది. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బిజెపి, జనసేన పార్టీలు గతంలో మాదిరిగా పొత్తులకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అధికార వైసిపి మరోసారి ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లడానికి సిద్దమయ్యింది. ఇప్పటికే ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టంచేసారు. అయితే తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తెలుగుదేశం పార్టీ మాదిరిగా వైసిపి కి పొత్తుల అవసరం లేదని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 2014 ఎన్నికల్లో మాదిరిగానే 2024 ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీచేసినా వైసిపి మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతుందని అన్నారు. కానీ ఫలితాలు మాత్రం 2018 లో మాదిరిగానే రిపీట్ అవుతాయని అన్నారు.
వైసిపి ప్రభుత్వం ఏపీలో సుపరిపాలన అందిస్తోందని... ప్రజలకు మంచి చేస్తోందని పెద్దిరెడ్డి అన్నారు. ఇవే తమను మళ్ళీ గెలిపించి రెండోసారి అధికారాన్ని కట్టబెడతాయని మంత్రి ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల్లో గెలవాలంటే వుండాల్సింది ఇతర పార్టీ అండ కాదు ప్రజలు అండగా వుంటే సరిపోతుందని అన్నారు. ప్రజలకు అందించే సంక్షేమం, చేపట్టే అభివృద్ది కార్యక్రమాలే వైసిపిని అధికారంలోకి తీసుకువస్తాయని అన్నారు.
Read More అమిత్ షా చెప్పేవరకు విశాఖలో భూదందా గురించి తెలియదా?: బీజేపీకి బొత్స కౌంటర్
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాజకీయంగా బలహీనపడ్డాడని... అందుకే ఇతర పార్టీల సహాయంకోసం ఎదురుచూస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. కానీ వైఎస్ జగన్ మాత్రం రోజురోజుకు బలపడుతున్నాడని... అందుకే ఇతర పార్టీల అండ ఆయనకు అవసరం లేదన్నారు. సీఎం చెప్పినట్లు గతంలో కంటే అధికసీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
