ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. సీట్ల పంపకాలలో పార్టీ అధినేతలకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. నాకంటే నాకు అని.. సీట్ల కోసం అభ్యర్థులు కొట్టుకుంటున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. తాజాగా.. విజయవాడ పశ్చిమ టికెట్ చంద్రబాబుకి తలనొప్పిగా మారింది.

ఆ టికెట్ తనకే కేటాయించారంటూ జలీల్ ఖాన్ కుమార్తె ఇప్పటికే మీడియా ముందు ప్రకటించేశారు. అయితే.. ఈ స్థానం నుంచి టికెట్ ఆశించిన నాగుల్ మీరా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు కేటాయించకుండా టికెట్ జలీల్ ఖాన్ కుమార్తెకు ఎలా కేటాయిస్తారని అసహనం వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తితో నాగుల్ మీరా పార్టీ మారతారు అనే ప్రచారం కూడా జరిగింది.

అయితే..దీనిపై నాగుల్ మీరా తాజాగా వివరణ ఇచ్చారు. తనకు పార్టీలో అసంతృప్తి ఉన్నమాట నిజమేనని కాకపోతే.. పార్టీ మాత్రం మారనని చెప్పారు. అతను అలా చెప్పడానికి కారణం ఉంది. ఎప్పుడైతే మీడియాలో నాగుల్ మీరా పార్టీ మారతారు అనే ప్రచారం మొదలైందో.. అప్పుడే పార్టీ అధిష్టానం అలర్ట్ అయ్యింది.

ఎంపీ కేశినేని నాని.. ఈ విషయంలో నాగుల్ మీరాతో చర్చలు జరిపారు. పార్టీ మారే విషయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అంతేకాదు.. చంద్రబాబుని కలిసేందుకు స్వయంగా.. నాగుల్ మీరాని.. కేశినేని నాని వెంట పెట్టుకొని మరీ వచ్చారు. మరి చంద్రబాబుతో భేటీలో ఏం జరుగుతుందో చూడాలి.