అవంతి శ్రీనివాస్ అంతరాష్ట్రాలకు పారిపోయే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ శాసన మండలి సభ్యులు మంతెన సత్యనారాయణరాజు హెచ్చరించారు. అంతేకాదు మరో రెండేళ్ల తర్వాత రాష్ట్రంలో వైసీపీ ఉండదు, దేశంలో జగన్ ఉండడు అంటూ వ్యాఖ్యానించారు. 

వైసీపీ ప్రలోభాలకు లొంగకుండా టీడీపీలోనే ఉన్నారన్న అక్కసుతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై  వైసీపీ  కక్ష్య సాధింపు చర్యలు చేపడుతోందని మండిపడ్డారు. 

వెలగపూడి.. కబడ్ధార్ అని  మంత్రి అవంతి శ్రీనివాసరావు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అవంతి బెదిరింపులకి భీమిలి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలే భయపడరు, ఇంక ఆయన తాటాకు చప్పుళ్లకు టీడీపీ ఎమ్మెల్యే భయపడ్తారా? అంటూ ఎద్దేవా చేశారు.

ప్రజలు వైసీపీని నమ్మి 151 సీట్లు ఇస్తే...రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షలు, కార్పణ్యాలు, తప్పుడు కేసులతో రెండేళ్ళు వృధా చేసారని విరుచుకు పడ్డారు. 

ప్రజలు వైసీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. జగన్ ని నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయినట్లు అవంతిని నమ్మి భీమిలి నియోజకవర్గ ప్రజలు మోసపోయారన్నారు.

అవంతి విశాకలో భూకబ్జాలు చేయడం తప్ప మంత్రిగా తన నియోజకవర్గానికి గానీ రాష్టానికి గానీ ఈ రెండేళ్లలో చేసిందేంటి? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన మరుసటిరోజే విశాఖలో అవంతి చేసిన భూకబ్జాలపై చర్యలు తీసుకుంటామని, చేసిన తప్పులకు భయపడి అవంతి..అంతరాష్ట్రాలకు పారిపోయినా వదిలిపెట్టం అని హెచ్చిరించారు.