శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత కూన రవి కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) నేత మోహన్ తో జరిపిన ఫోన్ సంభాషణలు ఆయనను చిక్కుల్లో పడేశాయి. ఇప్పటికే ఎమ్మార్వోను అసభ్యపదజాలంతో దూషించిన కేసును కూన రవి కుమార్ ఎదుర్కుంటున్నారు. 

వైసీపీ నేత మోహన్ ను కూన రవి కుమార్ ఫోన్ లో చేసిన బెదిరింపు వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. తేడా వస్తే లేపేస్తానని కూన రవికుమార్ మోహన్ ను బెదిరించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా పొందూరులో టీడీపీ కార్యాలయం వైసీపీ నేత మోహన్ కు చెందిన భవనంలో ఉంది. దాన్ని ఖాళీ చేయించాలని వైసీపీ నేతల నుంచి మోహన్ కు ఒత్తిళ్లు వస్తున్నాయి. 

Also Read: అసభ్య పదజాలంతో దూషణలు: అజ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్

గత ఎన్నికల సమయంలో మోహన్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. నేతల ఒత్తిడితో టీడీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించాలని మోహన్ కూన రవి కుమార్ ను కోరారు. దాంతో కూన రవి కుమార్ మోహన్ ను బెదిరించారు. మర్యాద తప్పితే మర్యాద దాటాల్సి వస్తుందని కూన రవి కుమార్ మోహన్ తో అన్నారు.

ముందు భవనం ఖాళీ చేసి, తర్వాత తన గురించి ఆలోచించాలని మోహన్ అన్నారు. దాంతో తేడా వస్తే లేపేస్తా అంటూ కూన రవి కుమార్ మోహన్ ను బెదిరించారు. తానేమీ బెదిరించలేదని కూన రవి కుమార్ అన్నారు. పద్దతిగా వ్యవహరించాలని మాత్రమే చెప్పానని ఆయన అన్నారు.

Also Read: అజ్ఞాతం వీడిన టీడీపి నేత రవికుమార్: పోలీసుల ముందు లొంగుబాటు