శ్రీకాకుళం: పొందూరు తాహిసిల్దార్ తామరాపల్లి రామకృష్ణను అసభ్య పదజాలంతో దూషించారనే ఆరోపణపై టీడీపీ నేత కూన రవికుమార్ మీద కేసు నమోదైంది. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సోమవారం ఉదయం ఆయన ఇంటిని చుట్టుముట్టారు. అయితే, ఆయన అప్పటికే ఇంటి నుంచి వెళ్లిపోయారు.

రెండు రోజుల క్రితం బదిలీపై వెళ్లిన శ్రీకాకుళం జిల్లా పొందూరు తహాసిల్దార్ రామకృష్ణను తెలుగుదేశం పార్టీ నేత, మాజీ విప్ కూన రవి కుమార్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 16వ తేదీన గొరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవి కుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్వో ఫిర్యాదుతో రామకృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

దాంతో రవి కుమార్ తాహిసిల్దార్ కు ఫోన్ చేసి బెదిరించినట్లు తెలుస్తోంది. ఆ ఆడియో ఆలస్యంగా వెలుగు చూసింది. "వాహనాలను విడిచి పెట్టు... లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తా" కూన రవికుమార్ బెదిరించారు. 

"నా చేతిలో ఏమీ లేదు. సీజ్ చేసి అప్పగించేశాను" అని రామకృష్ణ చెప్పారు. దాంతో కూన రవికుమార్ దుర్భాషలాడుతూ ... "నువ్వు సీజ్ చేశావు గానీ కంప్లైంట్ చేయలేదని నాకు తెలుసు. చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి" అని అన్నారు.

కూన రవికుమార్ది రాక్షసత్వమని తాహిసిల్దార్ రామకృష్ణ అన్నారు. రవికుమార్ కు అధికారులంటే చులకన భావన అని, ప్రభుత్వ అధికారులను దూషించడం ఆయనకు అలవాటేనని అన్నారు. గతంలో కూడా రవి కుమార్ తనను దుర్భాషలాడాడని ఆయన చెప్పారు. 

పాతేస్తానని తనను రవికుమార్ బెదిరించాడని, ఆఫీసులోకి చొరబడి దాడి చేయడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. రవి కుమార్ అనుచరులు తన కారును వెంబడించి బెదిరింపులకు దిగారని ఆయన అన్నారు.