గుంటూరు: దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజా సంక్షేమం కోసం  నిర్ణయాలు తీసుకుంటారని... కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన కమీషన్ల కోసం, వైసీపీ నేతల సంపాదన కోసం నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు. అసలు మద్యం రేట్లు ఎందుకు పెంచారు, ఇప్పుడు ఎందుకు తగ్గించారు? ఇది తుగ్లక్ నిర్ణయం కాదా? అని సీఎంను జవహర్ ఎద్దేవా చేశారు. 

''రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగున్న సమయంలో మధ్యం షాపులు తెరిచి వేల సంఖ్యలో ఉన్న కరోనా కేసుల్ని లక్షల సంఖ్యలోకి మార్చారు.  కరోనా సమయంలో మద్యం షాపులు తెరవడమే తప్పయితే మద్యం రేట్లు పెంచి  మద్య తరగతి ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నారు. పెరిగిన రేట్ల తో మద్యం కొనలేక అలవాటు మానలేక శానిటైజర్ త్రాగి 50 చనిపోయారు. మరికొంతమంది  ఆత్మహత్యలు చేసుకున్నారు.  వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి, వారికి దిక్కేవరు? దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు?'' అని నిలదీశారు. 

''ఇక మరోవైపు ముఖ్యమంత్రి కమీషన్లకు కక్కుర్తి పడి వైసీపీ నేతలకు సంబంధించిన డిస్టరీల్లో తయారయ్యే నాణ్యత లేని బ్రాండ్లకు అనుమతు లిచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆ బ్రాండ్లు కొనకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకుంటారనే పొరుగు రాష్ట్రాల నుంచి ప్రభుత్వం బస్సులు నడపడం లేదు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు తనకు కమీషన్లు, వైసీపీ నేతలకు అక్రమ ఆదాయం వస్తే చాలు అన్నట్లు ముఖ్యమంత్రి వ్యహరించటం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు. 

read more  ఇళ్లపట్టాల పంపిణీ వాయిదా అందుకోసమే..: మాజీ మంత్రి సంచలనం

''మద్యపాన నిషేదం అంటే..మద్యం రేట్లు పెంచటం, తగ్గించటమేనా?  రాష్ట్రంలో ఏవైపు చూసినా మద్యం ఏరులై పారుతుంటే మద్యం షాపులు తగ్గించామని ప్రభుత్వం చెప్పటం మహిళల్ని మోసం చేయడమే. ఎక్సయిజ్ మంత్రి రాష్ట్రంలో  నాటు సారా, అక్రమ మద్యం గంజాయి వంటి వాటిని అరికట్టడంపై దృష్టి పెట్టకుండా ప్రజలను బెదిరించడం, అందినకాడికి దోచుకోవడం, టీడీపీ పై బురద చల్లటంపైనే దృష్టి సారిస్తున్నారు.కమీషన్లు తీసుకుని మంత్రే ఏకంగా రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మకానికి, నాటు సారా తయారీకి అనుమతి లిస్తున్నారు'' అని ఆరోపించారు. 

''వైసీపీ ప్రభుత్వ తీరుతో ఆంధ్రప్రదేశ్ మధ్యాంద్రప్రదేశ్ గా మారిపోయింది. పెంచిన మద్యం రేట్లపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు మూడు రాజధానులు పై కూడా వెనక్కి తగ్గి అమరావతికి జై కొట్టడం ఖాయం. అస్తవ్యస్త నిర్ణయాలతో రాష్టాన్ని బ్రష్టుపట్టిస్తున్నందుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తరిమికొట్టడం ఖాయం'' అని జవహర్ అన్నారు.