బస్సు యాత్ర కాదది... సీఎం జగన్ దండయాత్ర : మాజీ మంత్రి జవహర్
నారా భువనేశ్వరి యాత్ర సమయంలోనే వైసిపి కూడా బస్సు యాత్ర చేపట్టడంపై మాజీ మంత్రి కేఎస్ జవహర్ సీరియస్ అయ్యారు.

అమరావతి : తన భర్త చంద్రబాబు నాయుడిని అన్యాయంగా జైల్లో పెట్టారని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు నారా భువనేశ్వరి. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా పలు రకాలుగా ఆందోళనలు చేపట్టిన భువనేశ్వరి ప్రస్తుతం బస్సు యాత్ర చేపడుతున్నారు. 'నిజం గెలవాలి' పేరిట చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాతి పరిణామాల కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఈ యాత్రకు పోటీగా అధికార వైసిపి కూడా బస్సు యాత్రకు సిద్దమయ్యింది. దీంతో వైసిపి యాత్రపై టిడిపి నేత, మాజీ మంత్రి జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నేటినుండి 'సామాజిక సాధికారత' పేరిట వైసిపి బస్సు యాత్ర ప్రారంభంకానుంది. అయితే ఇది ప్రజల కోసం జరుగుతున్న సామాజిక యాత్ర కాదని... ప్రజలపై జగన్ చేస్తున్న దండయాత్ర అని మాజీ మంత్రి జవహర్ ఎద్దేవా చేసారు. అసలు వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం అభివృద్ది చేసిందని ఈ యాత్ర చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇంతకాలం ప్రజా సంక్షేమాన్ని మరిచిన ఆ పార్టీకి ఎన్నికలు రాగానే సామాజిక సాధికారత గుర్తొచ్చిందన్నారు. అసలు జగన్ కు, వైసిపి నాయకులకు ఏ యాత్రలు చేసే అర్హత లేదని జవహర్ అన్నారు.
వైసిపి యాత్ర చేపట్టే బస్సుకు ఓవైపు కోడి కత్తి శ్రీను ఫోటో... మరోవైపు ఎమ్మెల్సీ చేతిలో చనిపోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవం ఫోటో ఉంచాలన్నారు జవహర్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దళితులపై దాడులు చేసిన వారిని ముందుగా వైసిపి దూరం పెట్టాలని... ఆ తర్వాతే ఏ సామాజిక యాత్ర అయినా చేపట్టవచ్చని అన్నారు. బస్సు యాత్ర కాదు ఏం చేసినా ప్రజలు వైసిపిని, వైఎస్ జగన్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు మాజీ మంత్రి.
Read More నేను రాజకీయాల కోసం రాలేదు.. నా బాధను మహిళలు అర్థం చేసుకుంటారని.. : భువనేశ్వరి
టిడిపి హయాంలో ప్రజల కోసం అనేక పథకాలు తీసుకువచ్చామని... వాటిని వైసిపి అధికారంలోకి రాగానే రద్దు చేసిందని జవహర్ అన్నారు. ఇలా దాదాపు
120 కి పైగా పథకాలను ఎందుకు రద్దు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. 1.40 లక్షల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి పోయాయో చెప్పాలని జవహర్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్ దళిత ద్రోహి... కాదని వైసిపి నాయకులు చెప్పగలరా? అని నిలదీసారు. దళితులపై దాడులు, అవమానకరంగా శిరోముండనాలు... చివరకు ప్రాణాలు తీసిన చరిత్ర వైసిపి నాయకులది... అలాంటివాళ్లు సామాజిక సాధికరత అంటూ బస్సు యాత్ర చేయడం విడ్డూరంగా వుందని మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు.