నేను రాజకీయాల కోసం రాలేదు.. నా బాధను మహిళలు అర్థం చేసుకుంటారని.. : భువనేశ్వరి
నేను రాజకీయాల కోసం ఇక్కడికి రాలేదని, తన బాధను మహిళలు అర్థం చేసుకుంటారనే భావిస్తున్నట్టు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. ఆమె తిరుపతిలో చంద్రగిరిలోని అగరాలలో నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమంలో మాట్లాడారు.

తిరుపతి: తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. తాను ఇక్కడికి రాజకీయాల కోసం రాలేదని వివరించారు. తన బాధను మహిళలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు. నిజం గెలవాలని చెప్పడానికే ఇక్కడికి వచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలను ఆమె వివరించారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితో ట్రస్ట్ ఏర్పాటు చేశామని, ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచించేవాడని, ఆయనకు ప్రజల తర్వాతే కుటుంబం అని వివరించారు. హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో హేళన చేశారని, కానీ, ఇప్పుడు లక్షల మంది ఐటీ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.
చంద్రబాబుపై ఇన్ని కేసులు పెడుతున్నారని, కానీ, ఒక్కదానిలోనైనా ఆధారాలు ఉన్నాయా? అని భువనేశ్వరి ప్రశ్నించారు. పుంగనూరులో టీడీపీ సైకిల్ ర్యాలీపైనా దాడి జరిగిందని, ఎన్నాళ్లీ దారుణాలు సహించాలని అడిగతారు. అందరం చేతులు కలిపి పోరాడాలని పిలుపు ఇచ్చారు. ఈ పోరాటం తనదే కాదని, ప్రజలందరిదీ అని వివరించారు.
Also Read: డిగ్రీ ఉన్నంతమాత్రాన పని చేయాలని భార్యను ఒత్తిడి చేయరాదు: మెయింటెనెన్స్ కేసులో ఢిల్లీ హైకోర్టు
వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదని, రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో నిర్బంధించారని భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ తెలుగు పౌరుషం ఏమిటో తెలియజేశారని వివరించారు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ముందడుగే వేయాలని పేర్కొన్నారు. అందుకే నిజం గెలవాలి.. నిజం గెలవాలి అని వివరించారు. సత్యమేవ జయతే అంటూ ఆమె కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు.