మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్... (వీడియో)
మాజీ మంత్రి, టిడిపి బిసి విభాగం అధ్యక్షుడు కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసారు.

విజయవాడ : తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసారు. మచిలీపట్నం నుండి విజయవాడ వెళుతుండగా తాడిగడప సెంటర్ లో రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. బిసిలపై వైసిపి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దాడులను నిరసిస్తూ టిడిపి ఆందోళనకు సిద్దమయ్యింది. ఈ నేపథ్యంలో టిడిపి బిసి విభాగం అధ్యక్షడు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసారు.
తనను అడ్డుకున్న పోలీసులపై రవీంద్ర సీరియస్ అయ్యారు. తాను ఏ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లడం లేదని... విజయవాడ భారతీనగర్ లోని ఇంటికి వెళుతుంటే అడ్డుకోవడం ఏమిటని మాజీ మంత్రి ప్రశ్నించారు. విజయవాడ పోలీస్ కమీషనర్ తో మాట్లాడిన రవీంద్ర తనను వదిలిపెట్టాలని కోరారు. అయినప్పటికి ఆయనను వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసారు.
వీడియో
ఈ సందర్భంగా మాజీ మంత్రి రవీంద్ర మాట్లాడుతూ... రాష్ట్రంలో బీసీ లపై జరుగుతున్న దాడులను ఖండించినందుకే బీసీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. వైసిపి పాలనలో బీసీలపై దాడులు, హత్యలు ఎక్కువయ్యాయని... వైసిపి నాయకులు బిసిల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. బిసిల హక్కులకోసం పోరాడుతున్న నాయకులను అణచివేసేందుకు జగన్ రెడ్డి పోలీసులను పావులా వాడుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో బీసీలకు బ్రతికే హక్కు కూడా లేకుండా జగన్ రెడ్డి చేస్తున్నారని రవీంద్ర మండిపడ్డారు.