గుంటూరు: రాష్ట్రంలో మంత్రులు, వైసీపీ నాయకులు ప్రజాధనం దోపిడీ లక్ష్యంగా పనిచేస్తున్నారుని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసరావు విమర్శించారు. ఎవరికి దొరికినకాడికి వాళ్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. 

''సీఎంగా ఉన్న వ్యక్తి అవినీతి ఆరోపణలు ఎదర్కోవడాన్ని ప్రజలు హేళనగా చూస్తున్నారన్నారు. ఇసుక మట్టి అధికార పార్టీ నాయకుల అవినీతికి ఆనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల నుండి మద్యం  తెచ్చి అమ్ముకుని అవినీతికి కేరాఫ్ అడ్రసుగా వైసీపీ నిలబడిందని మండిపడ్డారు. 

ఇక కార్మిక శాఖా మంత్రి జయరామ్ అయితే లంచం రూపంలో బెంజ్ కారు తీసుకున్నట్లు ఆధారాలతో చూపించామన్నారు. ఈఎస్ఐ కేసులో ఏ14 గా ఉన్న కార్తీక్ నుండి కారు తీసుకున్నారని స్పష్టం చేశారు. కార్తీక్ పేరుతో మంత్రి జయరామ్ కారు తీసుకోవడం అవినీతి కాదా? అని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. ఇప్పటివరకు మంత్రిని భర్తరఫ్ చేయకపోవడం అటుంచి కనీసం విచారణకు ఎందుకు ఆదేశించలేదని అన్నారు. 

read more  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామే కాదనలేదు...మరి జగన్ ఎందుకిలా: సోమిరెడ్డి

వైసీపీ తీరు విచిత్రంగా ఉందని... వైసిపి ఎంపీలు రాష్ట్ర సమస్యల పట్ల పార్లమెంటులో ప్రశ్నించడం లేదన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది టీడీపీని ఆడిపోసుకుని, అమరావతిని ఆపడానికి కాదని అన్నారు. ప్రజాస్వామ్య వేదికైన పార్లమెంటును చౌకబారు వ్యాఖ్యలు చేయడానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం మీది, మీ చేతుల్లో ఉంది కదా టీడీపీ హయాంలో తప్పులు జరగితే సాక్ష్యాలతో నిరూపించాలని కాలువ సవాల్ విసిరారు. 

సిట్, సీఐడీ, సీబీఐ, మంత్రి ఉపసంఘం అని వేసి ఏమీ నిరూపించలేకపోయారన్నారు. పరిపాలనను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఉన్మాదానికి ఉగ్రరూపం వస్తే ఎలా ఉంటుందో వైసీపీ తీరు అలా ఉందని ఆరోపించారు. 

న్యాయ వ్యవస్థలపై వ్యాఖ్యలు చేసే వైసీపీ నేతలకు వివేకానంద రెడ్డి హత్య కేసులో కోర్టు తీర్పు గుర్తు లేదా? అని ప్రశ్నించారు. పైశాచికంగా కోర్టులపై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.. ఏ తప్పూ చేయని అచ్చెన్నాయుడును 73 రోజులు అన్యాయంగా జైల్లో ఉంచారని, వైసీపీ అరాచకాలపై న్యాయ పోరాటం చేస్తున్నందుకే ఆయనపై కక్షగట్టారని కాలువ విమర్శించారు.