Asianet News TeluguAsianet News Telugu

నీ పులివెందులలోనే... ఇదీ రైతన్నల పరిస్థితి: సీఎం జగన్ కు కళా చురకలు

ఆంధ్ర ప్రదేశ్ లో రైైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కళా వెంకట్రావు. 

tdp leader kala venkatrao serious on CM YS Jagan over Farmers Issues
Author
Guntur, First Published Sep 7, 2021, 12:14 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంతో రాష్ట్ర రైతాంగం కష్టాల కడలిలో మగ్గిపోతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాలాలు ఎంతో కష్టపడి అన్నదాత పండించిన పంటలకు మద్ధతు ధర లేక రోడ్ల పక్కన పడేసే దుస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. మొన్న ప్రకాశం జిల్లా గిద్దలూరులో పచ్చిమిర్చి, నిన్న సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో టమోటాకు మద్ధతు ధర దక్కకపోవడంతో రైతులు రోడ్ల పక్కన పడేశారని కళా పేర్కొన్నారు. 

''కొద్దిరోజుల క్రితం ఉల్లిపాయ ధర 50కిలోల బస్తాకు రూ.1000 నుండి రూ.1500 ధర పలికితే... ఇప్పుడు దారుణంగా ధర పడిపోయి రూ.100 నుండి రూ.300 వుంది. కనీసం ఉల్లి రైతులకు కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కావడంలేదు. ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కక రైతు బతుకు ప్రశ్నార్థకంగా మారింది'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''ముఖ్యమంత్రి జగన్ కేవలం వైసీపీ నేతలకు అద్దెల రూపంలో దోచిపెట్టేందుకు ఆర్భాటంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇందులో పంటల వివరాలు నమోదు చేయడంగానీ, కొనుగోలు చేయడంగానీ చేయడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతులపై పెట్టుబడి భారం 30 శాతం పెరిగింది. జగన్ రెడ్డి వచ్చాక దళారుల బెడద ఎక్కువై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు పెట్టుబడులు, మరోవైపు మార్కెట్ దోపిడీల రూపంలో రైతులు దారుణంగా నష్టపోతున్నారు'' అన్నారు. 

read more  అవ్వాతాతల డబ్బులు కొట్టేసిన పాపం...ఊరికేపోదు జగన్ రెడ్డి: లోకేష్ హెచ్చరిక

''అధికారంలోకి రాగానే రూ.4 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైంది? రూ.4 వేల కోట్లను ఏం చేశారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారా? లేదా?  రైతులకు సమాధానం చెప్పాలి'' అని వెంకట్రావు డిమాండ్ చేశారు. 

''మరోవైపు 28 నెలలుగా వ్యవసాయ పనిముట్లకు అందించే సబ్సీడీని పూర్తిగా పక్కనబెట్టారు. డ్రిప్ ఇరిగేషన్ ఎత్తి వేయడంతో  రాయలసీమలోని 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. డ్రిప్, వ్యవసాయ పనిముట్లపై 90 శాతం సబ్సీడీ ఇచ్చి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకున్నారు. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు వాటి ద్వారా లబ్ధి పొందారు. కానీ వీటన్నింటిని నేడు జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు వ్యవసాయాన్ని భారంగా చేశారు'' అని తెలిపారు. 

''రాష్ట్రంలో సాగుశాతం పడిపోయింది. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉన్న రైతులకు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ. వందల టీఎంసీల నీళ్లు సముద్రాల్లోకి వదలడానికైనా ఇష్టపడతున్నారు కానీ పంటకాలువల్లోకి వదలడానికి మాత్రం చేతులు రావడం లేదు.  ఈ విధంగా రైతాంగాన్ని అన్ని విధాలా నిర్లక్ష్యం చేయడం ముఖ్యమంత్రికి తగదు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలి'' అని మాజీ మంత్రి కళా వెంకట్రావు మండిపడ్డారు. 
 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios