Asianet News TeluguAsianet News Telugu

అవ్వాతాతల డబ్బులు కొట్టేసిన పాపం...ఊరికేపోదు జగన్ రెడ్డి: లోకేష్ హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పిఛన్లు కట్ చేశారని... దీంతో తీవ్ర మానసిక క్షోభతో వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారని టిడిపి నాయకులు నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. 

Jagan Government cutting pensions... nara lokesh serious
Author
Amaravati, First Published Sep 6, 2021, 12:03 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా వృద్ధాప్య పింఛన్లు తొలగించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. పింఛన్లు అందక తీవ్ర ఆందోళనతో కొందరు వృద్దులు మరణించగా మరికొందరు రోడ్డెక్కి నిరసనకు దిగిన సంఘటనలను లోకేష్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికన వైసిపి సర్కార్, సీఎం జగన్ పై లోకేష్ సీరియస్ అయ్యారు.   
 
 ''పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న వైఎస్ జగన్ ఇప్పుడు తుంచుకుంటూ పోతున్నారు. రూ.3 వేల పెన్షన్ ఇస్తానని ఆశపెట్టి మాట మార్చారు, మడమ తిప్పారు. 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తానని డాబు కబుర్లు చెప్పి అడ్డమైన కారణాలు చెబుతూ భారీగా పెన్షన్లు కోతపెడుతున్నారు'' అని మండిపడ్డారు. 

read more  రాజారెడ్డి రాజ్యాంగంలో కొత్తగా జే.ఎమ్.ఎమ్ ట్యాక్సులు...: అచ్చెన్నాయుడు

''గత రెండు నెలల్లోనే 2.30 లక్షల పెన్షన్లు లేపేసి అవ్వా తాతలకు తీరని అన్యాయం చేసారు. మీరు పెడుతున్న మానసిక క్షోభ భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనే ఆధారంగా బతుకుతున్న 13 మంది  వృద్ధులు మృతి చెందారు'' అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 

''మీరిచ్చిన హామీ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు రూ.2,750 పెన్షన్ ఇవ్వాలి. ప్రతి అవ్వా తాత దగ్గరా నెలకు రూ.500 కొట్టేస్తున్నదేకాక భారీగా పెన్షన్లు కోసేస్తున్న పాపం వూరికేపోదు జగన్ రెడ్డి గారు. ఆరోగ్య సమస్యలు, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వారి పెన్షన్లు తీసేయడం సబబు కాదు. ఎత్తేసిన పెన్షన్లు అన్ని వెంటనే ఇవ్వాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios