Asianet News TeluguAsianet News Telugu

మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే పరువులేదు.. నీకు వుందా? : వసంతకు ఉమ కౌంటర్

మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేబినెట్ మంత్రులకే పరువులేదు...   అలాంటిది నీకు పరువు వుందా? దానికి భంగం కలిగించినందుకు క్షమాపణలు చెప్పాలా? అంటూ వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లీగల్ నోటీసులపై మాజీమంత్రి ఉమ సెటైర్లు వేసారు.

TDP Leader Devineni Uma serious on YSRCP MLA Vasantha Krishna Prasad AKP
Author
First Published Jan 10, 2024, 12:54 PM IST

విజయవాడ : మాజీ  మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ చివరకు కోర్టులద్వారా తేల్చుకునే స్థాయికి చేరారు. తనపై హత్యారోపణలు చేయడమే కాదు తీవ్ర విమర్శలు చేసిన దేవినేని ఉమపై పరువునష్టం దావా వేస్తూ లీగల్ నోటీసులు పంపించారు వసంత కృష్ణప్రసాద్. తాజాగా ఈ లీగల్ నోటీసులపై ఉమ ఘాటుగా స్పందించారు. 

అసలు మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేబినెట్ మంత్రులకే పరువులేదు...   అలాంటిది నీకు పరువు వుందా? దానికి భంగం కలిగించినందుకు క్షమాపణలు చెప్పాలా? అంటూ వసంత కృష్ణప్రసాద్ ను ఎద్దేవా చేసారు దేవినేని ఉమ. ప్రకృతి సంపదను అడ్డగోలగా దోచుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.  అవినీతి చిట్టా మొత్తం బయటపెట్టి నిన్ను ప్రజలముందు నిలబెడతానని దేవినేని ఉమ హెచ్చరించారు. 

ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాల్సిన వసంత కృష్ణప్రసాద్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంట్రాక్టులు చేస్తున్నాడని ఉమ ఆరోపించారు. ఇలా అవినీతి, అక్రమాలతో కాంట్రాక్టులు చేస్తూ ఆ బిల్లుల కోసమే ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడని అన్నారు. ఒక్కసారయినా నియోజకవర్గ అభివృద్ది గురించి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లావా? అని ఉమ ప్రశ్నించారు. 

ఓ వైపు  కాంట్రాక్ట్ బిల్లుల కోసం వైఎస్ జగన్ కాళ్ళపై పడుతూనే మరోవైపు పార్టీ మారేందుకు వసంత ఏర్పాట్లు చేసుకుంటున్నాడని ఉమ సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసిపిలో టికెట్ రాదని తెలిసి వేరే పార్టీని సీటివ్వాలని వసంత అడుగుతున్నాడని అన్నారు. ఒకే రోజు మూడు పార్టీలు మార్చిన కుటుంబం మీది... ఇప్పుడు ఏ పార్టీ నుండి పోటీ చేస్తావో నీకే తెలియదు? అంటూ వసంత కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇలా వసంత కృష్ణప్రసాద్ టిడిపిలో చేరనున్నట్లు జరుగుతున్న ఊహాగానాల నేపథ్యంలో మాజీ మంత్రి ఉమ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
 
ఇక వైసిపి ఎమ్మెల్యే వసంతపై మరోసారి హత్యా ఆరోపణలు  చేసారు దేవినేని ఉమ.  ఇసుక దోపిడీ గురించి ప్రశ్నించిన విలేకర్ గంటా నవీన్ ను నీ అనుచరులతో    చంపించింది వాస్తవం కాదా? అని నిలదీసారు. చివరకు బినామీ ఆస్తుల కోసం బంధువు పొదిలి రవిని కూడా వసంత చంపించాడని ఆరోపించాడు. ఇలా ఇసుక, బూడిద అక్రమ రవాణా, అటవీ సంపద దోపిడీతో వసంత ఆగర్భ శ్రీమంతుడిగా మారిపోయాడని... ఈ సొమ్ముతో అమెరికా వెళ్ళి పార్టీలు చేసుకుంటాడని దేవినేని ఉమ ఆరోపించారు.

వసంత చేసిన పాపాలన్నీ బయటికి వస్తే ఎలక్షన్ కమీషనే అనర్హుడిగా నిర్ణయిస్తుందని ఉమ అన్నారు.  ఒకవేళ ఎన్నికల్లో పోటీచేసినా ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఆయనను తరిమితరిమి కొడతారన్నారు. వసంత కృష్ణప్రసాద్ అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆధారాలన్నీ కోర్టు ముందు ఉంచుతానని... న్యాయస్థానమే ఆయనకు సరైన సమాధానం చెబుతుందని ఉమ అన్నారు.
 
 
 

  

Follow Us:
Download App:
  • android
  • ios