అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల కార్మికులు కష్టాలు ఎదుర్కొంటున్నారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్ల కార్మికులు పస్తులుండాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని వుందని.... ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కార్మికుల కోసం ఈ వైసిపి ప్రభుత్వం ఖర్చుచేయలేదని ఉమ ఆరోపించారు.   

మేడే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఉమ పాల్గొని కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.  రాష్ట్రంలో ఇవాళ ఉన్న గడ్డు పరిస్థితులు ఏ రోజూ లేవని.... జగన్ అవగాహనలేమి వల్ల 60 లక్షల మంది అసంఘటిత కార్మికులు, 3 లక్షల మంది ఆటో డ్రైవర్లు, లక్షలాది మంది డ్రైవర్లు గత 40 రోజులుగా పస్తులుంటున్నారని అన్నారు. దీనికి జగన్ సమాధానం చెప్పాలన్నారు. 

''లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను కార్మికులు గౌరవించి ఇళ్లకే పరిమితం అయితే.. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత జగన్ కు లేదా. కేంద్రం కరోనా కోసం ఇచ్చిన నిధులు ఏం చేశారు. అసంఘటిత కార్మికులు ప్రభుత్వ లెక్కల్లోనే 20 లక్షల మంది ఉన్నారు. కార్మిక శాఖలో ఉన్న రూ.1600 కోట్ల నిధులను దారి మళ్ళించారు. దీంతో కార్మికులు పస్తులుంటున్నారు'' అని ఆరోపించారు. 

''జగన్ అవినీతి వల్ల కార్మికులకు నష్టం జరుగుతోంది. 40 రోజుల్లో కార్మికుల కోసం ఒక్క రూపాయి కూడా జగన్ సాయం చేయలేదు. కార్మికులను టీడీపీ తన శక్తిమేర ఆదుకుంటోంది. కేరళలో 12 రకాల నిత్యావసర సరకులు ఇస్తున్నారు. జగన్ మాత్రం రూ.5కేజీల బియ్యం, రూ.వెయ్యి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా అసంఘటిత కార్మికులకు రూ.10వేల ఆర్థిక సాయం అందజేయాలి. రూ.1600 కోట్ల నిధుల్లోనే ఖర్చు పెట్టాలి. వారికి నిత్యావసర సరుకులు అందజేయాలి'' అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

''కార్మికులు వారు కట్టాల్సిన పన్నులు, ఈఎంఐలు రద్దు చేయాలి.  మున్సిపాలిటీల్లో, అనుబంధ సంస్థల్లో, ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. తాడేపల్లి నుంచి రికార్డెట్ ప్రెస్ మీట్లతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే కార్మికులకు ప్యాకేజీ ప్రకటించాలి. ఇందుకోసమే టీడీపీ పోరాడుతోంది'' అని దేవినేని ఉమ వెల్లడించారు.