మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత దేవినేని ఉమల మధ్య వ్యవహారం ప్రస్తుతం ఉప్పు నిప్పుగా మారింది. ఈ నేపథ్యంలో నానిపై ఉమ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంత్రితో సహా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్, వంశీపై ఫిర్యాదు చేశారు.

లారీతో తొక్కించి తమను చంపుతామని వారు బెదిరించినట్లు ఉమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొత్సాహంతోనే నాని, కృష్ణప్రసాద్, వంశీ తనను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Also Read:టీడీపీపై కొడాలి నాని దూకుడు: కారణం ఇదేనా?

మంత్రిగా బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి లారీతో తొక్కిస్తాననడం ఏంటని ఉమ ప్రశ్నించారు. కొడాలి నాని మాటల వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని ఆయన ఆరోపించారు. నానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమలపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత బచ్చుల అర్జునుడు విమర్శించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, వైసీపీ అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదని అర్జునుడు జోస్యం చెప్పారు.