అర్థరాత్రి అరెస్టయిన టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబును పరామర్శించేందుకు సీఐడి కార్యాలయం వద్దకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబు (ashok babu)ను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (devineni umamaheshwar rao) ఆరోపించారు. అక్రమకేసులు బనాయించి అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్ట్ చేసిన సీఐడి అధికారులు విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ (third degree) ప్రయోగిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. వెంటనే అశోక్‍ బాబును మీడియాకు చూపాలని దేవినేని ఉమ డిమాండ్ చేసారు. 

తమ పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబును కలిసేందుకు ఇవాళ ఉదయమే దేవినేని ఉమ సీఐడి కార్యాలయానికి వెళ్లారు. టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లిన ఉమను సీఐడి కార్యాలయంలోకి వెళ్ళనివ్వకుండా బారికేడ్లను అడ్డుపెట్టి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సీఐడి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో దేవినేని ఉమతో పాటు టిడిపి నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.

అంతకుముందు సీఐడి కార్యాలయం వద్దే దేవినేని ఉమా మాట్లాడుతూ... సీఐడీ అధికారులు కావాలనే ఎమ్మెల్సీ అశోక్ బాబుపై అక్రమ కేసులు పెట్టారన్నారు. గతంలో సొంతపార్టీ ఎంపీ రఘరామ కృష్ణమరాజును కొట్టినట్లే ఇప్పుడు అశోక్ బాబుని సైతం కొట్టారన్నారు. అశోక్ బాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించేందుకే అర్ధరాత్రి అరెస్ట్ చేసారని ఉమ పేర్కొన్నారు. 

అశోక్ బాబు ఏ తప్పూ చేయలేదు కాబట్టే అక్రమ కేసులు పెట్టినా భయపడలేదని... అందుకే ముందస్తు బెయిల్ కూడా తీసుకోలేదన్నారు. దీంతో కావాలనే శుక్రవారం రోజు అరెస్ట్ చేసి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఉమ పేర్కొన్నారు. 

శాసనమండలిలో అశోక్‍ బాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు... అందుకే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ప్రస్తుతం ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న తమపై ఎన్ని దాడులు చేసినా భయపడబోమని మాజీ దేవినేని ఉమ పేర్కొన్నారు. 

దేవినేని ఉమతో పాటు టిడిపి శ్రేణులు సీఐడి కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిస్థితి చేయిదాటేలా కనిపించడంతో సీఐడీ కార్యాలయం వద్దే దేవినేని ఉమతో పాటు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడినుండి తరలించారు.

ఇదిలావుంటే టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబుకు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కూడా అనుమతించింది. శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది. 

మ్మెల్సీ అశోక్ బాబు సర్వీస్ లో ఉన్న సమయంలో పదోన్నతి కోసం విద్యార్హతను తప్పుగా చూపించారంటూ ఆరోపణలున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసినప్పుడు బీకాం చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధృవపత్రం సమర్పించారని విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో అశోక్ బాబుపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదు నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త. సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక్ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయగా... గత నెల 25న వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 477 (A ), 466, 467, 468, 471,465,420, R/w34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఈ క్రమంలోను అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్ట్ చేసారు.