తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సెక్యూరిటీపై రాష్ట్రప్రభుత్వ తీరుపై తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

మీరు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం మీ పట్ల ఎలాంటి వివక్ష చూపలేదు. మీరు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సహా మీకు ఏ సందర్భంలోనూ భద్రత విషయంలో రాజీపడకుండా చూసుకుంది.

మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రతిపక్షనేత భద్రత పట్ల అశ్రద్ధగా వ్యవహారించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉదయం మీరు హోంమంత్రిని కలవడం, సాయంత్రానికి విమానాశ్రయంలో చంద్రబాబును సాధారణ పౌరుడి మాదిరిగా చూడటం సమంజసమేనని మీరు భావిస్తున్నారా.. అని అవినాశ్ ప్రశ్నించారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై భౌతిక దాడులు చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. గత ఏడాది జగన్‌పై కోడికత్తితో దాడి జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహారించిందని అవినాశ్ గుర్తు చేశారు.

కానీ ఇప్పుడు జగన్ మాత్రం అవమానించేలా, ముఖ్యమంత్రి పదవికి అపఖ్యాతి తెచ్చేలా వ్యవహారిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చంద్రబాబుకు భద్రత పెంచి సీఎం హోదాకున్న గౌరవాన్ని పెంచుకుంటారని ఆశిస్తున్నట్లు అవినాశ్ పేర్కొన్నారు.