తెలుగు దేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్‌కు ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. గత వారం చింతమనేనిపై నమోదైన కేసులో తదుపరి చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది. 

తెలుగు దేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. తనపై చింతలపూడి పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడంతో ప్రభాకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేలా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని చింతమనేని ప్రభాకర్ తరుపున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసం ఈ కేసుపై తదుపరి చర్యలపై స్టే ఇచ్చింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ బాదుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం ప‌రిధిలోని వెంకంపాలెంలో కూడా గత సోమ‌వారం నిర‌స‌న తెలియ‌జేశారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయితే స్థానిక సర్పంచి, వైసీపీ నాయకులు అక్కడికి చేరుకుని చింతమనేని వ్యాఖ్యలను తప్పుబట్టారు. టీడీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్ర‌మంలో అక్క‌డ గొడ‌వ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. 

అయితే ఎమ్మెల్యే చింత‌మ‌నేని తన‌ను కులం పేరుతో తిట్టాడని స్థానిక స‌ర్పంచ్ టి. భూప‌తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలోనే మాజీ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ నాయ‌కులు కూడా వైసీపీ నాయ‌కుల‌పై ఫిర్యాదు చేశారు. తాము శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న స‌మ‌యంలో వైసీపీకి చెందిన స‌ర్పంచ్ టి. భూపతి, ఉప సర్పంచ్‌ ఎస్‌.రమేష్ రెడ్డి తో పాటు మ‌రి కొంద‌రు నాయ‌కులు ఆయుధాలతో టీడీపీ నాయ‌కులను తిడుతూ కొట్ట‌బోయార‌ని ఆరోపించారు. దీంతో త‌మ‌ను తాము కాపాడుకున్నామ‌ని వారు చెప్పారు. ఇదే విష‌యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు వ‌ర్గాల నుంచి అందిన ఫిర్యాదును ఎస్ఐ స్వీక‌రించారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా కేసులు న‌మోదు చేసిన‌ట్టు ఎస్ చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతామ‌ని తెలియ‌జేశారు.