నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాలు చేస్తున్న అయ్యన్నపాత్రుడు ఈసారి తన వారసుడు చింతకాయల విజయ్‌ని చట్టసభలో చూడాలనుకుంటున్నాడు. తాను ఎప్పటిలాగే నర్సీపట్నం నుంచి అసెంబ్లీకి, విజయ్‌ని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని అయ్యన్నపాత్రుడు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపిక, నిధుల సమీకరణ, ప్రచార వ్యూహాలపై దృష్టి పెట్టాయి. వైసీపీ మాత్రం ఈ విషయంలో దూకుడు మీద వుంది. మిగిలిన పార్టీలు కూడా అదే దిశగా సాగుతున్నాయి. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తానని చెప్పిన జగన్ అన్న మాట ప్రకారం ఆప్తులైనా, సన్నిహితులైనా నో టికెట్ అంటున్నారు. ఇది వైసీపీలో అసంతృప్తులకు కారణమవుతోంది. టీడీపీ కూడా దీనికి అతీతం కాదు. టికెట్ కేటాయింపుపై క్లారిటీ లేకపోవడంతో చాలా మంది తెలుగుదేశాన్ని వీడేందుకు సిద్ధమవుతున్నారు. 

ఇక ఆ పార్టీలో సీనియర్ల విషయానికి వస్తే.. తమతో పాటు వారసులను కూడా ఏకకాలంలో బరిలోకి దించాలని భావిస్తున్నారు. కానీ ఒకే కుటుంబంలో రెండు టికెట్లు అంటే హైకమాండ్‌కు తలనొప్పులు తప్పవు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సీనియర్ నేతలు తమ పిల్లలకు కూడా టికెట్లు కోరుతున్నారు. వీరిలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఒకరు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో వున్న ఆయన ఎన్నో పదవులు నిర్వహించారు. ప్రతిపక్షంలో వున్నా ప్రభుత్వంపై పోరాటం చేసి ఎన్నో కేసులను ఎదుర్కోన్నారు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాలు చేస్తున్న అయ్యన్నపాత్రుడు ఈసారి తన వారసుడు చింతకాయల విజయ్‌ని చట్టసభలో చూడాలనుకుంటున్నాడు. 

దీనిలో భాగంగా తాను ఎప్పటిలాగే నర్సీపట్నం నుంచి అసెంబ్లీకి, విజయ్‌ని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని అయ్యన్నపాత్రుడు భావిస్తున్నారు. అయితే నర్సీపట్నం నుంచి పోటీకి అయ్యన్నకు ఎలాంటి అవరోధాలు ఎదురుకావు. ఎటోచ్చి అనకాపల్లి గురించే ఆయన టెన్షన్. దీనికి అనేక కారణాలున్నాయి. ఈ స్థానంపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు మాట ఇచ్చినట్లుగా పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్‌ను తనకు ఇవ్వాలని పవన్ .. చంద్రబాబును కోరగా అది ఎంపీ సీటు కావడంతో టీడీపీ బాస్ కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదని టాక్. అందుకే అయ్యన్నకు ఇప్పుడు మాట ఇవ్వలేని పరిస్ధితి. 

దీనికి తోడు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ .. జనసేనలో చేరనుండటంతో పాటు ఎట్టిపరిస్ధితుల్లోనూ అనకాపల్లినే అడుగుతారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయనకే ఈ సీటు కేటాయించే అవకాశం వుంది. దీంతో అయ్యన్నపాత్రుడు ఇటీవలికాలంలో పొలిటికల్‌గా సైలెంట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా తాను రాజకీయాల నుంచి రిటైరై.. నర్సీపట్నం నుంచి కుమారుడు విజయ్‌ని బరిలోకి దించితే ఎలా వుంటుందన్న దానిపైనా అయ్యన్నపాత్రుడు యోచిస్తున్నారు.

తొలుత అనకాపల్లి ఎంపీ సీటు కోసం ట్రై చేసి , లేనిపక్షంలో నర్సీపట్నాన్ని విజయ్‌కి కట్టబెట్టాలని ఆయన పావులు కదుపుతున్నారు. చంద్రబాబు వద్ద అయ్యన్నకు మంచి పరపతి వుంది , దీనికి తోడు టీడీపీ సోషల్ మీడియా విభాగం మొత్తం చింతకాయల విజయ్ నేతృత్వంలోనే నడుస్తుంది. అలాగే లోకేష్‌కు విజయ్ ఆప్తుడు కావడంతో ఆయనకు టికెట్ అయితే కన్ఫర్మ్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అయ్యన్న కోరుతున్న విధంగా రెండు టికెట్లు ఇస్తారా లేదా అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.