వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్ కు ముందే తెలుసు.. బుద్ధా వెంకన్న
రాత్రి ఆరోగ్యంగా ఉన్న గంగాధర్ రెడ్డి ఉదయానికి అనారోగ్యంతో ఎలా మృతి చెందాడు.. అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న అనుమానం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం : వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్ కు అన్నీ తెలుసునని టిడిపి ఉత్తరాంధ్ర ఇన్చార్జ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. జైల్ మేట్ వి.సాయిరెడ్డిని ముందే పంపించి గుండె పోటుతో మరణించారని నమ్మించారు. ఎన్నికలకు ముందు ప్రజలను పక్కతోవ పట్టించడానికి సిబిఐకి అప్పజెప్పారు. ఎన్నికల్లో గెలిచాక సిబిఐ విచారణ అక్లర్లేదని చెప్పడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు.
సొంత బాబాయ్ హత్య గురించి మూడేళ్లుగా జగన్ మాట్లాడటం లేదన్నారు.కుట్రదారులు పేర్లు బైటకు వస్తాయని సాక్ష్యాలు అన్నింటినీ తొక్కి పెడుతున్నారన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో గంగాధర్ రెడ్డి ముఖ్య సాక్షి. అనంతపూర్ ఎస్పీని ముందే కలిసి తనకు ప్రాణహాని వుందని వాపోయారు. అతను సడెన్ గా ఎలా చనిపోతాడు. 40 ఏళ్ల యువకుడు.. రాత్రి బాగున్న వ్యక్తి ఉదయానికి అనారోగ్యంతో ఎలా చనిపోతాడు.
వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు అనుమానాస్పద స్ధితిలో చనిపోతున్నారు. జగన్ పాత్ర ఎంత వరకూ వుందో సిబిఐ విచారాణ జరపాలి. గంగాధర్ రెడ్డి మృతిపై కూడా సిబిఐవిచారణ జరపాలి. హత్యలు చేసి వ్యవస్ధలను మేనేజ్ చేసినట్లుగా, కుటుంబ సభ్యులను కూడా మేనేజ్ చేస్తున్నారు. వివేకాతో శత్రుత్వం ఎవరితో వుందో ఆరాతీస్తే మూలాలు బైటకు వస్తాయి. హత్యకేసు దర్యాప్తు వేగవంతం చేయమని సునీతారెడ్డి వాపోతున్నా జగన్ కు పట్టడంలేదు. సునీతా రెడ్డికి ఆమె భర్తకు రక్షణ కల్పించాలి.
అప్పుడు మొద్దుశీనును చంపారు.. ఇప్పుడు వివేకా కేసులోనూ, సాక్షుల్ని కాపాడుకోండి : లోకేష్ వ్యాఖ్యలు
దర్యాప్తు వేగవంతం చేయకపోతే ఇంకా అనేక మంది చనిపోయే ప్రమాదం వుంది. ఎన్నికల్లో లబ్దికోసం ఎవరినైనా చంపేయచ్చు. ఆ పాపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టి సానుభూతి ఓట్లు పొందవచ్చు. తనకు సిబిఐ నుంచి నోటీసులు ఇచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. జగన్ అనేక సార్లు ఢిల్లీ వెళుతున్నారు. సిబిఐ ఆఫీస్ కి వెళ్లి దర్యాప్తు వేగవంతం చేయమని అడిగరెందుకు. వివేకా హత్య కేసులో దోషుల్ని త్వరితగతిన పట్టుకోవాలి. నారాలోకేష్ కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలి. లోకేష్ అంటే వైసిపీ లో భయం మొదలైంది.
జగన్ పోవాలి..చంద్రబాబు రావాలి అన్నది మా నినాదం కాదు. ప్రజలే నినదిస్తున్నారు. ఒంటరిగా పోటీచేయగలరా అని మమ్మల్ని అడుగుతున్నారే... ఎన్నికల్లో వైసిపితో కలుస్తామని ఎవరన్నా అడుగుతున్నరా? జగన్ పాలన గురించి 30 ఏళ్ల వరకూ ఎవ్వరూ మరిచిపోరు అని అన్నారు. ఈ సమావేశంలో విశాఖ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, విశాఖ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ ఎల్లపు శ్రీనివాసరావు, నడిగట్ల శంకర్ పాల్గొన్నారు.