మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు ప్రధాన కారణం వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డేనని సీబీఐ స్పష్టం చేసిందని బొండా ఉమ వ్యాఖ్యానించారు. అయినా కూడా వైసీపీ నేతలు బొంకుతూనే ఉన్నారంటూ ఆయన దుయ్యబట్టారు. సీబీఐ విచారణను సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టడం బరితెగింపేనంటూ బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ (Ys jagan) బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై (sajjala rama krishna reddy) మండిపడ్డారు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు (bonda uma) . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు ప్రధాన కారణం వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డేనని సీబీఐ స్పష్టం చేసిందని బొండా ఉమ వ్యాఖ్యానించారు. అయినా కూడా వైసీపీ నేతలు బొంకుతూనే ఉన్నారంటూ ఆయన దుయ్యబట్టారు.
సీబీఐ విచారణను సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టడం బరితెగింపేనంటూ బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య చేయించిన వారిని, చేసిన వారిని కాపాడే ప్రయత్నాలను చూసి ప్రజలు నివ్వెరపోతున్నారని చురకలు వేశవారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసిందని... అధికారంలోకి వచ్చిన వెంటనే సీబీఐ విచారణ వద్దని కోర్టులో పిటిషన్ వేశారంటూ బొండా ఉమా ఎద్దేవా చేశారు. జగన్‌పై నమ్మకం లేకే వివేకా కూతురు సునీత హైకోర్టులో పిటిషన్ వేసిందని ఆయన గుర్తుచేశారు.
కాగా.. వివేకా హత్య విషయంపై శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు వుండాలని డిమాండ్ చేశారు . చంద్రబాబు (chandrababu naidu) వ్యంగ్యంగా మాట్లాడి అపహాస్యం పాలవుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వివేకా (ys vivekananda reddy) లేకపోవడం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ అని సజ్జల మండిపడ్డారు. సీఎం జగన్ పెద్ద అండను కోల్పోయారని.. ఇప్పటికీ వైఎస్సార్ మృతిపై (ys rajasekhara reddy) అనుమానాలు వున్నాయని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. ఎన్టీఆర్ మృతికి ఇండైరెక్ట్‌గా కారణమైన వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు.
వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని, ఆరోపణలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. హార్ట్ ఎటాక్ అని చెప్పినంత మాత్రన అది దర్యాప్తును ఎలా ప్రభావితం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. సాక్ష్యాలను ఎవరూ తారుమారు చేయలేరని.. సీబీఐ ఎదురుగా వున్న సాక్ష్యాలను కూడా పట్టించుకోదా అని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదన్నారు. చంద్రబాబులాగే లోకేశ్ (lokesh) కూడా పనికి రాకుండా తయారయ్యాడని సజ్జల మండిపడ్డారు. సీబీఐ కంటే ఉన్నతమైన దర్యాప్తు చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు అంటూ రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు.
