వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని బొండా ఉమా ఆరోపించారు. కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయిని చంపిన వారిని శిక్షించాల్సిందిపోయి.. నిందితుల మీద సీబీఐ విచారణను జగన్ ఉపసంహరించారని బొండా ఉమా మండిపడ్డారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం కలకలం రేపుతోంది. తాజాగా వివేకా హత్యపై టీడీపీ (tdp) నేత బొండా ఉమా మహేశ్వరరావు (bonda uma) మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో సీఎం జగన్ ను సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని బొండా ఉమా ఆరోపించారు. కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయిని చంపిన వారిని శిక్షించాల్సిందిపోయి.. నిందితుల మీద సీబీఐ విచారణను జగన్ ఉపసంహరించారని బొండా ఉమా మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ కోరిన జగన్.. ఇప్పుడెందుకు వద్దంటున్నారని ఆయన నిలదీశారు.
వివేకా హత్య కేసులో అడ్డంగా దొరికిపోయినా కూడా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ పడరాని పాట్లు పడుతున్నారన్నారని... ఆయన్ను కాపాడేందుకు జగన్ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో లెక్కేలేదని ఆరోపించారు. హత్య జరిగిన రోజు నుంచి జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఉమా విమర్శించారు.
సాక్ష్యాలు దొరకకుండా నిందితులు జాగ్రత్త పడ్డారని, హత్యకు సంబంధించి సీబీఐ సగం కేసునే వెలికి తీసిందని బొండా ఉమా ఆరోపించారు. అవినాష్ రెడ్డి నాటకాలాడి తమపై విషప్రచారం చేశారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక వివేకా హత్యను గెలుపు కోసం వాడుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే కేసును తప్పుదోవ పట్టించారని బొండా ఉమా మండిపడ్డారు. హత్యలో వైసీపీ నేతల ప్రమేయమున్నా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
అంతకుముందు వివేకా హత్య కేసుపై (ys viveka murder case) కొందరు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna Reddy). మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య , జగన్‌ను (ys jagan) బాగా కుంగదీసిందని సజ్జల చెప్పారు. వివేకా హత్యపై సీబీఐ (cbi) ఛార్జ్‌షీట్ పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. సీబీఐ ఛార్జ్‌షీట్ అంటూ కేసుతో సంబంధం లేనివారిపై కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అవినాశ్ గెలుపు కోసం వివేకా ప్రచారం చేశారని.. వివేకా హత్య కుట్ర కంటే ఇప్పుడు పెద్ద కుట్ర జరుగుతోందని సజ్జల మండిపడ్డారు.
శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాశ్ రెడ్డి (avinash reddy) వివేకా ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. అందరూ వివేకా కేసులో వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వివేకాది మర్డర్ అని బయటపెట్టే లెటర్‌ను ఆరోజు సాయంత్రం వరకు ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ కూడా ఒక పథకం ప్రకారం వైసీపీ నేతల్ని ఇరికించే కుట్ర చేస్తోందని సజ్జల ఆరోపించారు. మార్చి 15న కేసు రిజిస్టర్ అయినప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో వుందని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా అదే అధికారులు కంటిన్యూ అయ్యారని ఆయన చెప్పారు. కొందరి పేర్లు చెప్పాలంటూ తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని అనుమానితులు ఆరోపిస్తున్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు.
