నెల రోజుల్లో 40 మంది ఎమ్మెల్యేలు జగన్ పై తిరుగుబాటు: రాపాక ఆరోపణలకు టీడీపీ కౌంటర్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలని తనకు మంతెన రామరాజు ప్రలోభాలకు గురి చేశారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన ఆరోపణలపై టీడీపీ స్పందించింది.
అమరావతి:రాపాక చెప్పినదంతా తాడేపల్లి స్క్రిప్ట్ అని టీడీపీ అధికార ప్రతినిధి బొండా ఉమ మహేశ్వరరావు ఆరోపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు తనను ప్రలోభపెట్టారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆరోపించారు.ఈ ఆరోపణలపై టీడీపీ నేత బొండా ఉమ స్పందించారు. ఆదివారంనాడు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు,రాపాక తరహలో మరికొందరు బయటకు రావడం ఖాయమన్నారు. రాపాక వరప్రసాద్ ఇప్పటికే వైసీపీకి అమ్ముడుపోయారన్నారు. రాపాక వరప్రసాద్ ను రూ. 10 కోట్లకు కొనేది ఎవరని ఆయన ప్రశ్నించారు. రూ. 10 వేలు కూడా రాపాక వరప్రసాద్ కు ఎక్కువేనని ఆయన చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు రాపాకన వరప్రసాద్ ను ఓటేయాలని అడిగిన రోజే ఎందుకు ఈ విషయం బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. మరో నెల రోజుల్లో 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయనున్నారని బొండా ఉమ మహేశ్వరరావు చెప్పారు. అంతేకాదు 60-70 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని బొండా ఉమ మహేశ్వరరావు చెప్పారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు ద్వారా ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు.
also read:సినీ నటి శ్రీదేవి కంటే ఎమ్మెల్యే శ్రీదేవి నటన అద్భుతంగా ఉంది: మంత్రి అమర్‌నాథ్
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఓటు చేశారని ఆ పార్టీ నాయకత్వం గుర్తించింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు టీడీపీ అభ్యర్ధి అనురాధకు క్రాస్ ఓటింగ్ చేశారని ఆపార్టీ నాయకత్వం గుర్తించింది. ఈ నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ నాయకత్వం. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ నాయకత్వం డబ్బులతో ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 15 నుండి రూ. 20 కోట్లు ఆఫర్ చేశారని వైసీపీ ఆరోపణలు చేసింది. అయితే తనకు కూడా టీడీపీ నుండి ప్రలోభాలు వచ్చాయని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ స్పందించింది.