విజయవాడ జిల్లాకు టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు పేరును వైసిపి ప్రభుత్వం ఖరారు చేయగా... కాపు నేత వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని టిడిపి నాయకుడు బోండా ఉమా డిమాండ్ చేస్తూ నిరసన దీక్షకు దిగారు.
విజయవాడ: స్థానిక నిరుపేదల సమస్యలపై పోరాడుతూ ప్రాణాలు అర్పించిన కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా (vangaveeti ranga) పేరును విజయవాడ జిల్లాకు పెట్టాలని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు (bonda uma) డిమాండ్ చేసారు. ఇప్పటికే వైసిపి (ysrcp) ప్రభుత్వం విజయవాడ ప్రధానకేంద్రంగా టిడిపి (TDP) వ్యవస్థాపకులు ఎన్టీఆర్ (NTR) పేరుతో జిల్లాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విజయవాడకు ఆ పేరు వద్దని... ఆయన పుట్టిన నిమ్మకూరు మచిలీపట్నం జిల్లా పరిధిలో వుంది కాబట్టి దానికే ఎన్టీఆర్ పేరు పెట్టాలని బోండా ఉమ డిమాండ్ చేసారు.
విజయవాడ జిల్లా (Vijayawada district)కు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఇవాళ(బుధవారం) ధర్నా చౌక్ లో బోండా ఉమ నిరసన దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షాస్థలంలో ఉమ మాట్లాడుతూ... అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా? అని వైసిపి ప్రభుత్వాన్ని నిలదీసారు. అసలు ఇప్పుడు ఏర్పాటుచేయాలని నిర్ణయించిన కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటి..? కొత్త ఉద్యోగం ఒక్కటైనా వస్తుందా..? అని బోండా ఉమ నిలదీసారు.
''వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. జిల్లాల విభజన విషయంలో రాష్ట్రం భగ్గుమంటుంటే సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదు'' అని ఉమా అడిగారు.
''దివంగత కాపు నాయకుడు వంగవీటి రంగా అభిమానులను కించపరిచే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టకుంటే అన్ని పార్టీలను కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉదృతం చేస్తాము. ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా ముట్టడిస్తాం'' అని బోండా ఉమ హెచ్చరించారు.
ఇక బోండా ఉమ నిరసన దీక్షలో పాల్గొన్న రాధారంగ మిత్రమండలి సభ్యులు చెన్నుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ... వంగవీటి మోహనరంగా అందరి మనిషి, ప్రజల మనిషి అని అన్నారు. మరణించి ముప్పై ఏళ్లయినా నేటికీ ఆయన పేరుతో స్వచ్చందంగా కార్యక్రమాలు చేయడం ఆయన గొప్పతనమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే రంగా పరితపించే వారని శ్రీనివాస్ పేర్కొన్నారు.
బోండా ఉమా లాంటివారు విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాలంటూ చేపట్టిన దీక్షను ఎవరూ రాజకీయంగా వాడుకోవద్దు. పశ్చిమ కృష్షాకు వంగవీటి మోహనరంగా జిల్లాగా పేరు పెట్టాలనే ఏకైక డిమాండ్ తో పోరాడాలి. రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా రంగాకు అభిమానులు ఉన్నారు. బోండా ఉమ కూడా రాజకీయాలు మాట్లాడకుండా లక్ష్యం సాధించేలా అందరూ కలిసి నడిచేలా చూడాలి'' అని రాధారంగ మిత్రమండలి సభ్యులు శ్రీనివాస్ సూచించారు.
ఇదిలావుంటే మరికొన్ని జిల్లాల విషయంలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోవడంపై స్థానికులు ఆందోళనలకు దిగారు. రాజంపేటను కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంపై ఆందోళనలు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా మదనపల్లెను జిల్లా కేంద్రంగా కాకుండా రాయచోటిలో కలపడంపై స్థానికులు భగ్గుమంటున్నారు.నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆందోళనలు సాగుతున్నాయి. విజయవాడలో పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలను కలపడంపై ఆ ప్రాంత వాసులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శృంగవరపుకోటను విజయనగరంలో కలిపారు. అయితే నర్సీపట్టణాన్ని కలపకపోవడంపై కూడా అసంతృప్తి చెలరేగింది.
విశాఖపట్టణానికి సమీపంలో ఉన్న పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలను దూరంగా ఉన్న ప్రాంతాల్లో కలపడంపై ఆందోళన వ్యక్తమౌతుంది. అద్దంకి నియోజకవర్గాన్ని ఒంగోలులో కాకుండా బాపట్లలో కలపడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
ఇక హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. హిందూపురం ప్రజల మనోభవాలను అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఇటీవల హిందూపురంలో బాలయ్య ఆందోళన కూడా చేపట్టారు.
