విజయవాడ: పాదయాత్రలో నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో ప్రతి ఒక్క హామీ అమలులో మాట తప్పుతూ మడమ తిప్పుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు మండిపడ్డారు. ఏడాది పాలనపై దాదాపు రూ. 100 కోట్లతో అడ్వర్టైజ్ మెంట్స్ ఇచ్చి... లాక్ డౌన్ సమయంలోనూ అవినీతి పత్రికకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు. 

''జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనంతా దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోయింది. ఈ ఏడాది పాలనలో వైకాపా మేనిఫెస్టోలో ఏమేరకు పూర్తి చేశారన్న దానిపై ముఖ్యమంత్రితో సహా వైకాపా నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా..? ఏడాది పాలనపై గొప్పగా సమావేశాలు నిర్వహించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. హామీల అమలుపై బహిరంగ చర్చకు ముందుకు రాగలరా..?'' అని సవాల్ విసిరారు. 

''మేనిఫెస్టోలో చెప్పిన దానికి అమలు చేస్తున్న దానికి ఎక్కడా పొంతనలేదు. వైకాపాకు ఓటు వేసినందుకు తమ చెప్పుతో తాము కొట్టుకుంటున్నామని ప్రజలు భావిస్తున్నారు. జగన్ మాట తప్పారు-మడమ తిప్పారని రాష్ట్ర ప్రజానీకం ముక్తకంఠంతో చెబుతున్నారు. తెలుగుదేశం హయాంలో అవినీతి జరిగిందని పుస్తకం ప్రచురించిన వైకాపా.. ఏడాది కాలంలో ఒక్క రూపాయి అవినీతిని అయినా నిరూపించగలిగిందా..? అమరావతిలో 25వేల ఎకరాలు కాజేశారని.. 25 అంగుళాల అవినీతి కూడా చూపించలేకపోయారు'' అని అన్నారు. 

''వైకాపా పునాదే అవినీతి పునాది. పాదయాత్రలో నోటికొచ్చిన అబద్ధాలతో.. 620 హామీలు ఇచ్చారు. ఈ ఏడాదిలో ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నిర్వర్తించలేకపోయారు. అన్నదాతకు అరచేతిలో వైకుంటం చూపించి అధికారంలోకి వచ్చారు. కేంద్రంతో సంబంధం లేకుండా రైతు భరోసా ఇస్తానని చెప్పి.. కేంద్ర సాయాన్ని కలుపుకుని ఇస్తున్నారు. అది కూడా విడతలుగా ఇస్తూ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు''  అని ఆరోపించారు. 

read more  ఎన్టీఆర్ కి భారతరత్న అని ఆటపట్టించడం ఆయనకు ఆత్మశాంతి లేకుండా చేయడమే

''లాక్ డౌన్ 2 నెలల సమయంలో రైతులు పంటలు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతుంటే.. రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేశామన్న రూ. 3వేల కోట్ల ధరల స్థిరీకరణ ఏమైంది..? రూ. 4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. కరోనా విపత్తు సమయంలో ఆ సహాయనిధి నుంచి ఒక్కరినైనా ఆదుకున్నారా..? సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని.. ఏడాది కాలంలో తట్ట మట్టి కూడా వేయలేకపోయారు. తెలుగుదేశం హయాంలో 71 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయి. వైకాపా ఏడాది పాలనలో ఒక్క శాతం పనినైనా పూర్తిచేసిందా..?'' అని నిలదీశారు. 

'' రాష్ట్రంలో 62 సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి రూ. 65 వేల కోట్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గత ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ఇసుకను.. ఈ ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుని దోచుకుంటోంది. సంపూర్ణ మద్యపాన నిషేధమని మేనిఫెస్టోలో చెప్పి.. జే ట్యాక్స్ కోసం సొంత బ్రాండ్లను విక్రయిస్తున్నారు. వాటిని కూడా 75 శాతం ధరలు పెంచి దోచేస్తున్నారు. ఇళ్ల స్థలాలకు భూకొనుగోలు పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు ఇష్టారీతిన ప్రభుత్వ సొమ్మును దోచుకుంటున్నారు. బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ స్థలాలు అమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల ప్రజలపై రూ. 50 వేల కోట్ల పన్నుల భారం పడింది. దీనికి తోడు ఏడాది కాలంలో రూ. 85వేల కోట్లు అప్పు తెచ్చారు. ఈ డబ్బంతా ఏమైంది..? ఎవరి జేబుల్లోకి వెళ్లింది..?'' అని ప్రశ్నించారు. 

''ఏడాది కాలంలో ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేయకపోగా.. గత ప్రభుత్వ పథకాలను కూడా రద్దు చేశారు. కాపు కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కేటాయించకపోగా..గతంలో చంద్రబాబు కేటాయించిన నిధులను సైతం దారి మళ్లించారు. 80 లక్షల మంది విద్యార్థులకు గాను కేవలం 43 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి అందించారు. ఆ డబ్బులను కూడా నాన్న చేతిలో బుడ్డి పథకం పేరుతో లాగేసుకున్నారు'' అంటూ  ఎద్దేవా చేశారు. 

read more   నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్యూ: సుప్రీంకోర్టులో కేవియట్‌

''కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని.. ఉన్న కార్పొరేషన్లను కూడా పీకేశారు. పింఛన్లు  3000 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రూ 250 పెంచి చేతులు దులుపు కొన్నారు. ప్రమాణస్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలు పెంచబోనని ఊదరగొట్టి.. ఇప్పటివరకు రెండుసార్లు ఛార్జీలు పెంచారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని, సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని హామీనిచ్చి.. ఏడాది కాలంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ. 10వేలు ఇచ్చినట్లే ఇచ్చి.. ఫైన్ ల రూపంలో రూ. 20వేలు వసూలు చేశారు'' అని తెలిపారు. 

''రాష్ట్రంలో లక్ష మందికిపైగా అర్చకులు, 2 లక్షల మందికిపైగా పాస్టర్లు ఉంటే.. కేవలం 70వేల మందికి మాత్రమే ఆలయాలు, మసీదులు, చర్చిలలో పనిచేసే వారికి గౌరవ వేతనం ఇచ్చి మాట తప్పారు. రాష్ట్రంలో 50లక్షల మందికిపైగా అర్హులైన కాపు మహిళలు ఉంటే.. కేవలం 2.26 లక్షల మందికే ఆర్థిక సాయం అందించి కాపులను ఉద్దరించేసినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు చొప్పున 5ఏళ్లలో 25 లక్షల ఇళ్లు కడతామన్న జగన్మోహన్ రెడ్డి గారు.. ఈ ఏడాదిలో ఒక్క ఇంటిని అయినా నిర్మించారా..? పైగా చంద్రబాబు గారి హయాంలో నిర్మించిన ఇళ్లను కమీషన్ల కోసం వైకాపా నాయకులు అమ్ముకుంటున్నారు''అని ఆరోపించారు. 

''జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో ఒక్క పరిశ్రమ రాకపోగా.. వచ్చిన పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్లిపోయాయి. పాదయాత్రలో అంతా అబద్ధపు హామీలు ఇచ్చి.. ఏడాది పాలనలో ఏవిధంగా మాట తప్పి, మడమ తిప్పారో వీడియోలతో సహా ఆధారాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చే వరకు తెలుగుదేశం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది'' అని బోండా ఉమ వెల్లడించారు.