న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అంశంపై సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమేశ్‌కుమార్‌ను తిరిగి నియమించాలని శుక్రవారం ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఈనేపథ్యంలో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కేవియట్‌ పిటిషన్‌ వేశారు. గుంటూరుకు చెందిన కాంగ్రెస్‌ నేత మస్తాన్‌వలీ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే కేవియట్ వల్ల మస్తాన్ వలీకి విచారణలో అవకాశం లభిస్తుంది. 

హైకోర్టు తీర్పుపై స్టే ప్రభుత్వం స్టే కోరితే అందుకు వ్యతిరేకంగా వాదించే అవకాశం లభిస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించడానికి వీలుగా, కొత్త ఎస్ఈసీని నియమించడానికి వీలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేసింది. ఆ జీవోలను హైకోర్టు కొట్టేసింది.

రమేష్ కుమార్ ను వెంటనే ఎస్ఈసీగా నియమించాలని ఆదేశిస్తూ ఎస్ఈసీగా కనగ రాజ్ నియామకం చెల్లదని చెప్పింది. దీంతో ప్రభుత్వం ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి సమాయత్తమవుతోంది. 

కాగా, తాను విధులు చేపడుతామని రమేష్ కుమార్ చెప్పారు. నిష్పాక్షికంగా వ్యవహరిస్తానని ఆయన చెప్పారు. అయితే, తీర్పుపై వైసీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.