విజయవాడ: అమరావతిలో భూములు కొనకూడదని ఎక్కడైనా ఉందా అని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత బోండా ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. భూములు కొనకూడదని చట్టం ఉందా, ప్రభుత్వ  ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ అనేది బూటకమని, జగన్ పాలనలో వన్ సైడ్ ట్రేడింగ్ జరుగుతోందని ఆయన అన్నారు. 

వైసీపీ ఎంపీలు సిట్, ఏసీబీల విచారణపై కోర్టు ఇచ్చిన తీర్పులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కోర్టు బోనులో చేతులు కట్టుకుని నిలబడే వైసీపీ నాయకులు న్యాయమూర్తులకు చట్టాలు చెబుతున్నారని ఆయన అన్నారు. వైఎస్ వివేకానంద రెెడ్డి హత్యపై జగన్ కోర్టుకు వెళ్తే అప్పటి సీఎెం చంద్రబాబుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గుర్తు లేదా అని ఆయన ప్రశ్నించారు.

దమ్మలపాటి కేసులో హైకోర్టు తీర్పు కొత్తేమీ కాదని ఆయన చెప్పారు. గతంలో అప్పటి గవర్నర్ తీరా, మొన్న రకుల్ ప్రీత్ సింగ్ కేసులో ఇదే విధంగా తీర్పులిచ్చాయని ఆయన గుర్తు చేశారు. కోర్టు తీర్పులపై మాట్లాడుతున్న మేధావులకు గత తీర్పులు కనిపించడం లేదా అని ఆయన అడిగారు. 

అమరావతిలో ఐఎఎస్, ఐపీఎస్, జడ్జీలకు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చామని ఆయన చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2005లో జడ్జీలకు ఇంటి స్థలాలు ఇచ్చారని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలని ప్రజలు వైసీపీ ఎంపీలను గెలిపిస్తే వారు పార్లమెంటులో ఏం మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. విశాఖలో వన్ సైడ్ ట్రేడింగ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు.