Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు గెస్ట్‌హౌస్ అటాచ్.. అవన్నీ తప్పుడు కేసులే, నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు : బొండా ఉమా

కృష్ణానది కరకట్టకు ఆనుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివసిస్తున్న గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేయడంపై తెలుగుదేశం నేత బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్‌ను ఉన్నట్లుగా చూపించి.. తప్పుడు కేసులు పెట్టారని అవి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని ఆయన చురకలంటించారు

tdp leader bonda uma fires on ap govt attach chandrababu naidu guest house in karakatta ksp
Author
First Published May 14, 2023, 2:32 PM IST | Last Updated May 14, 2023, 2:32 PM IST

కృష్ణానది కరకట్టకు ఆనుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివసిస్తున్న గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేయడంపై తెలుగుదేశం నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల నుంచి జగన్ ఏం చేస్తున్నారంట ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నాలుగు నెలల్లో ఇంటికి వెళ్లిపోతుండగా.. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక జగన్ ఆంతర్యం ఏంటంటూ బొండా ఉమా ప్రశ్నించారు. 

లేని ఇన్నర్ రింగ్ రోడ్‌ను ఉన్నట్లుగా చూపించి.. తప్పుడు కేసులు పెట్టారని అవి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని ఆయన చురకలంటించారు. తప్పుడు కేసులకు భయపడే పరిస్ధితి లేదని.. ప్రజల దృష్టిని మరల్చేందుకే జగన్ ఇలా చేస్తున్నారని బొండా ఉమా ఆరోపించారు. ఈ వ్యవహారంపై త్వరలోనే వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తామని ఆయన తెలిపారు. జనసేన- టీడీపీ కలిసి పోటీ చేస్తే వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని జగన్ ఆత్మ ప్రశాంత్ కిశోర్ తన సర్వేల్లో చెప్పాడని బొండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. 

ALso Read: చంద్రబాబుకు భారీ షాక్.. కరకట్టపై గెస్ట్‌హౌస్ ‌అటాచ్ చేసిన ఏపీ సర్కార్..

కాగా..  కరకట్టపై చంద్రబాబు నాయుడు నివసిస్తున్న గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం ఆదివారం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండమెంట్ 1994 చట్టం ప్రకారం అటాచ్ చేస్తున్నట్టుగా పేర్కొంది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, సాధారణ ఆర్థిక నియమాలు పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించింది. స్థానిక జడ్జికి సమాచారమిస్తూ కరకట్టపై చంద్రబాబు గెస్ట్‌హౌస్‌ను అటాచ్ చేసింది. 

ఇక, సీఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోరడ్ అలైన్‌మెంట్లలో అవతవకలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించి ఏపీ సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి  తెలిసిందే.  టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు, నారాయణలు వారి పదవులను దుర్వినియోగం చేసినట్టుగా ఏపీ సీఐడీ చెబుతోంది. అధికారం ఉపయోగించుకుని బంధువులకు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. వ్యాపారవేత్త లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి ప్రతిఫలంగా గెస్ట్‌హౌస్ తీసుకున్నారని ఆరోపించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు గెస్ట్‌హౌస్ అటాచ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం నిబంధనల మేరకు చంద్రబాబు గెస్ట్‌హౌస్ అటాచ్ చేసినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios