Asianet News TeluguAsianet News Telugu

బూతుల యూనివర్సిటీకి జగన్ వీసీ అయితే.. విజయసాయిరెడ్డి రిజిస్ట్రార్ : సీఎంకు బొండా ఉమా కౌంటర్

తెలుగుదేశం పార్టీ , చంద్రబాబు నాయుడులపై సీఎం వైఎస్ జగన్‌కు కౌంటరిచ్చారు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. బూతుల యూనివర్సిటీకి జగన్ వైస్ ఛాన్సెలర్ అయితే, విజయసాయిరెడ్డి రిజిస్ట్రార్ అని ఆయన సెటైర్లు వేశారు. 

tdp leader bonda uma counter to ap cm ys jagan over his remarks on telugu desam party
Author
First Published Nov 22, 2022, 5:23 PM IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతలను కంట్రోల్ చేయడానికి జగన్ బూతులనే నమ్ముకున్నారని దుయ్యబట్టారు. తనకు, తన పార్టీకి అసలు బూతంటే ఏంటో తెలియవన్నట్లుగా జగన్ మొన్నటి నరసాపురం సభలో నటించారని బొండా ఉమా దుయ్యబట్టారు. బూతుల యూనివర్సిటీకి జగన్ వైస్ ఛాన్సెలర్ అయితే, విజయసాయిరెడ్డి రిజిస్ట్రార్ అని ఆయన సెటైర్లు వేశారు. 

అసెంబ్లీని కూడా బూతులకు అడ్డాగా మార్చిన ఘనత జగన్‌దేనన్న ఆయన.. ప్రతిపక్షనేతగా వున్నప్పుడు నాటి సీఎం చంద్రబాబును ఉరితీయాలి, కాల్చిచంపాలి, చెప్పుతో కొట్టాలి అంటూ జగన్ మాట్లాడారని బొండా ఉమా గుర్తుచేశారు. అలాంటి జగన్ ఇప్పుడు గురివిందగింజలా నీతులు చెబుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. కొడాలి నాని, రోజా, విజయసాయిరెడ్డి, తమ్మినేని సీతారాం, మల్లాది విష్ణు, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్న బూతులు జగన్‌కి వినిపించడం లేదా అని బొండా ఉమా నిలదీశారు. తాగి, గూండాలను వెంటబెట్టుకుని.. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేశ్‌కు జగన్ మంత్రి పదవి ఇచ్చారంటూ ఆయన దుయ్యబట్టారు. జగన్ ఆరు నెలలకు ఒకసారి బయటకు వచ్చి తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకుంటే జనం నమ్ముతారా అని బొండా ఉమా ప్రశ్నించారు. 

Also REad:టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు.. చంద్రబాబులో ఆ భయం కనిపిస్తోంది: సీఎం జగన్ ఫైర్

అంతకుముందు సీఎం జగన్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని మండిపడ్డారు. వీరు గతంలో చేసిన పాలనను ఇదేం ఖర్మరా బాబు అనుకోబట్టే 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు, దత్తపుత్రుడికి ప్రజలు బై బై చెప్పారని అన్నారు.

గత పాలకుల ఊహకు కూడా అందని విధంగా తమ ప్రభుత్వం అభివృద్ది చేస్తుందని జగన్ చెప్పారు. చెప్పుకోదగ్గ పని ఏది చేయలేదని తెలుసు కనుకే చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు నోటికి పని చెబుతున్నారని విమర్శించారు. తాము చేస్తున్న అభివృద్దిని చూసి అన్ని సామాజిక వర్గాల వారు, ప్రాంతాల వారు.. జరిగిన ప్రతి ఉప ఎన్నికలో, ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేశారని అన్నారు. చివరకు కుప్పంలో కూడా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించారని అన్నారు. అందుకే చంద్రబాబు ఇదేం ఖర్మరా బాబు అనుకుని తలపట్టుకుని కూర్చున్నాడని విమర్శించారు. 

1995లో చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా.. ఇలాంటి వ్యక్తికి ఇంట్లో, పార్టీలో స్థానం ఇచ్చినందుకు ఇదేం ఖర్మరా బాబు అని అనుకోని ఉంటాడాని కామెంట్ చేశారు. ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండటం చూసి.. ప్రజలు కూడా ఇదేం ఖర్మరా బాబు అని అనకుంటున్నారని చెప్పారు. ఈసారి అసెంబ్లీ  ఎన్నికల్లో గెలిపించకుంటే అవి ఆయనకు చివరి ఎన్నికలు అవుతాయని ప్రజలను బెదిరిస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. కుప్పంలోనే గెలవలేనని చంద్రబాబులో భయం కనిపిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రతి మాటలో, చేతలో నిరాశ, నిస్పృహాతో భయం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 

సెల్‌ఫోన్ టవర్ మీద నుంచి దూకెస్తామని, రైలు కింద తలకాయ పెట్టేస్తామని, పురుగుల మందతు తాగేస్తామని.. చెప్పే వాళ్ల మాదరిగా చంద్రబాబు ప్రవర్తన  తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఏ మంచి చేయని చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు, దత్తపుత్రడులకు ప్రజల గుండెల్లో స్థానం ఉండదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలు మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోవాలని కోరారు. మంచి జరిగితే తమకు అండగా, తోడుగా నిలబడాలని అని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios