Asianet News TeluguAsianet News Telugu

టీడీపీని తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు.. చంద్రబాబులో ఆ భయం కనిపిస్తోంది: సీఎం జగన్ ఫైర్

టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. దత్తపుత్రుడు పార్టీని రౌడీ సేనగా మార్చేశారని మండిపడ్డారు.

CM YS jagan slams chandrababu and Pawan Kalyan in Narasapuram
Author
First Published Nov 21, 2022, 1:30 PM IST

టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని మండిపడ్డారు. వీరు గతంలో చేసిన పాలనను ఇదేం ఖర్మరా బాబు అనుకోబట్టే 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు, దత్తపుత్రుడికి ప్రజలు బై బై చెప్పారని అన్నారు. సీఎం జగన్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

గత పాలకుల ఊహకు కూడా అందని విధంగా తమ ప్రభుత్వం అభివృద్ది చేస్తుందని జగన్ చెప్పారు. చెప్పుకోదగ్గ పని ఏది చేయలేదని తెలుసు కనుకే చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు నోటికి పని చెబుతున్నారని విమర్శించారు. తాము చేస్తున్న అభివృద్దిని చూసి అన్ని సామాజిక వర్గాల వారు, ప్రాంతాల వారు.. జరిగిన ప్రతి ఉప ఎన్నికలో, ప్రతి ఒక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేశారని అన్నారు. చివరకు కుప్పంలో కూడా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించారని అన్నారు. అందుకే చంద్రబాబు ఇదేం ఖర్మరా బాబు అనుకుని తలపట్టుకుని కూర్చున్నాడని విమర్శించారు. 1995లో చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా.. ఇలాంటి వ్యక్తికి ఇంట్లో, పార్టీలో స్థానం ఇచ్చినందుకు ఇదేం ఖర్మరా బాబు అని అనుకోని ఉంటాడాని కామెంట్ చేశారు. ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండటం చూసి.. ప్రజలు కూడా ఇదేం ఖర్మరా బాబు అని అనకుంటున్నారని చెప్పారు. 

ఈసారి అసెంబ్లీ  ఎన్నికల్లో గెలిపించకుంటే అవి ఆయనకు చివరి ఎన్నికలు అవుతాయని ప్రజలను బెదిరిస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు. కుప్పంలోనే గెలవలేనని చంద్రబాబులో భయం కనిపిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రతి మాటలో, చేతలో నిరాశ, నిస్పృహాతో భయం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సెల్‌ఫోన్ టవర్ మీద నుంచి దూకెస్తామని, రైలు కింద తలకాయ పెట్టేస్తామని, పురుగుల మందతు తాగేస్తామని.. చెప్పే వాళ్ల మాదరిగా చంద్రబాబు ప్రవర్తన  తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఏ మంచి చేయని చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. చంద్రబాబు, దత్తపుత్రడులకు ప్రజల గుండెల్లో స్థానం ఉండదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలు మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోవాలని కోరారు. మంచి జరిగితే తమకు అండగా, తోడుగా నిలబడాలని అని అన్నారు. 

ఇక, నరసాపురంలో రూ. 3,300 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం జగన్ చెప్పారు. నరసాపురం చరిత్రలో ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు జరగడం ఇదే తొలిసారి అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని తెలిపారు. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. ఫిషరీస్ యూనివర్సిటీతో నరసాపురం రూపురేఖలు మారతాయని తెలిపారు. 

దేశంలో ఫిషరీస్ యూనివర్సిటీలు తమిళనాడు, కేరళలో మాత్రమే ఉన్నాయని.. దేశంలో మూడో ఫిషరీస్ వర్సిటీ నరసాపురంలో రాబోతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్లు కూడా పూర్తయ్యాయని చెప్పారు. పనులు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు.  ఏపీలో 9 ఫిషింగ్ హార్బర్లు రానున్నాయని తెలిపారు. ఇందుకోసం రూ. 3,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఓఎన్‌జీసీ ద్వారా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం మత్య్సకారులను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios