Asianet News TeluguAsianet News Telugu

చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం..: కొడాలి నాని సవాలుకు సై అన్న బొండా ఉమ..

కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మంత్రి కొడాలి నాని సవాలును టీడీపీ నేత బొండా ఉమ స్వీకరించారు. కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లో ఏ తప్పూ జరగకుంటే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. కేసినో జరిగిందని నిరూపించడానికి తాము సిద్దంగా ఉన్నట్టుగా చెప్పారు. 

TDP Leader Bonda Uma challenge to kodali nani over gudivada casino issue
Author
Vijayawada, First Published Jan 22, 2022, 1:31 PM IST

కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా హల్‌చల్ చేశాయి. ఈ క్రమంలోనే శుక్రవారం టీడీపీ నిజనిర్దారణ కమిటీ గుడివాడకు వెళ్లింది. కే కన్వెన్షన్ సెంటర్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు మోహరించారు. టీడీపీ కార్యాలయం నుండి కె కన్వెన్షన్ సెంటర్ వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే  బొండా ఉమా మహేశ్వరరావును పోలీసుల అదుపులోకి తీసుకన్నారు. దీంతో అక్కడ టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే సమయంలో కొందరు బొండా ఉమకు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారు.  

అయితే గుడివాడలోని (gudivada) తన కళ్యాణ మండపంలో క్యాసినో, పేకాట వంటివి నిర్వహించినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మంత్రి కొడాలి నాని (kodali nani) సవాల్ విసిరారు. అంతేకాకుండా టీడీపీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా కొడాలి నాని సవాలుపై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడిన బొండ ఉమ.. కన్వెన్షన్ సెంటర్ లో ఏ తప్పూ జరగకుంటే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. కేసినో జరిగిందని నిరూపించడానికి తాము సిద్దంగా ఉన్నట్టుగా చెప్పారు. 

కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్‌‌లోనే కేసినో నిర్వహించారని.. తమ ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కొడాలి నాని దొరికిపోయి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నట్టుగా విమర్శించారు. కొడాలి నాని సవాలను తాము స్వీకరిస్తున్నామని.. కేసినో జరిగిందని నిరూపించడానికి సాక్ష్యాధారాలు ఉన్నామని చెప్పారు. ఎప్పుడో రావాలో చెప్పాలని.. డేట్, టైమ్ కొడాలి ఫిక్స్‌ చేసినా సరేనని సవాలు విసిరారు. 

చెరో పెట్రోల్ డబ్బా తెచ్చుకుందామని.. కేసినో జరిగిందని మీడియా ముఖంగా నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు. కేసినో జరగలేదంటే పెట్రోల్ పోసుకునేందుకు తాను సిద్ధమని తెలిపారు. కేసినో జరిగినట్టు రుజువైతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని బొండా ఉమ సవాలు విసిరారు. కేసినోలో డ్యాన్స్ చేసిన వారి పేర్లు కూడా తమ వద్ద ఉన్నాయని... విక్టర్, శశిభూషణ్ వంటి వాళ్లు డ్యాన్స్ చేశారని చెప్పారు. తాము కే కన్వెన్షన్ తనిఖీకి వెళ్తే ప్రభుత్వం వణికిపోయిందన్నారు. మహిళల అర్థనగ్న నాట్యాలను తానే ఆపించానని కొడాలి నాని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు కేసినో జరిగిన వీడియోలను మీడియాకు చూపించారు.

ఇక, టీడీపీ నిజనిర్దారణ కమిటీపై స్పందించిన కొడాలి నాని.. చంద్రబాబుకు (chandrababu naidu) టైం అయిపోయిందని.. ఎప్పుడూ గెలవని వర్ల రామయ్య, ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లందరితో నిజ నిర్థారణ కమిటీ వేశారంటూ ఆయన దుయ్యబట్టారు. ప్రశాంతంగా వున్న గుడివాడలో నిజ నిర్ధారణ కమిటీ పేరుతో గొడవలు పెడుతున్నారంటూ కొడాలి నాని ఆరోపించారు. సంక్రాంతికి రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్లే గుడివాడలోనూ జూదం జరిగిందని ఆయన అంగీకరించారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని తనకు సమాచారం రావడంతో తాను స్వయంగా డీఎస్పీకి ఫోన్ చేసి అడ్డుకున్నానని కొడాలి నాని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios