టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..
తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్ కుమార్ మేరకు బొజ్జల సుధీర్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

తిరుపతి: తెలుగుదేశం పార్టీ నేత బొజ్జల సుధీర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్ కుమార్ మేరకు బొజ్జల సుధీర్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు మరో 26 మంది టీడీపీ నేతలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసు స్టేషన్ వద్ద బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు టీడీపీ నేతలు శనివారం నిర్వహించిన నిరసన నేపథ్యంలోనే ఈ కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.
వివరాలు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టుకు నిరసనగా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇటీవల 'సైకో పోవాలి' నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి మండలం కమ్మకొత్తూరులో స్థానికులతో కలసి టీడీపీ శ్రేణులు నిరసన చేశారన్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్ కుమార్ తన సిబ్బందితో కమ్మకొత్తూరుకు వెళ్లి నిరసన చేపట్టిన వారితో దురుసుగా వ్యవహరించడమే కాకుండా దాడికి కూడా పాల్పడినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా అంతుచూస్తామని బెదిరింపులకు సైతం దిగాడని టీడీపీ శ్రేణులు తెలిపాయి.
ఈ క్రమంలోనే సీఐ అజయ్ కుమార్ తీరుపై శ్రీకాళహస్తి టీడీపీ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమ్మకొత్తూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వ్యవహరించిన తీరుపై సీఐ అజయ్ కుమార్‌ను బొజ్జల సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాదన నడిచింది. అయితే ఈ వాదనలో సీఐ అజయ్ కుమార్ బొజ్జల సుధీర్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ క్రమంలో పీఎస్ ముందు సుధీర్ రెడ్డి, ఆయన అనుచరులు నిరసనకు దిగారు. టీడీపీ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడి, భౌతిక దాడులకు పాల్పడ్డ సీఐ అజయ్ కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తల నిరసనకు జనసేన కార్యకర్తలు కూడా మద్దతుగా నిలిచారు.
టీడీపీ శ్రేణుల ధర్నా గంటల తరబడి కొనసాగుతుండటంతో శ్రీకాళహస్తి డీఎస్పీ భీమారావు, సీఐలు మల్లిఖార్జునతో పాటు పెద్ద సంక్యలో పోలీసులు రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని.. సుధీర్‌రెడ్డితో చర్చలు జరిపారు. అయినా ఆయన ధర్నా విరమణకు సుధీర్ రెడ్డి అంగీకరించలేదు. తమకు తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి హామీ ఇస్తే ధర్నా విరమిస్తామని చెప్పారు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని ఎస్పీ పరమేశ్వరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే సుధీర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన ఎస్పీ పరమేశ్వరరెడ్డి.. కమ్మకొత్తూరులో జరిగిన ఘటనపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనను విరమించారు.