చర్చకు పిలిస్తే పోలీసులను పంపుతావా.. ఇంత అహంకారమా : ఎమ్మెల్యే శిల్పా రవిపై అఖిలప్రియ ఆగ్రహం
నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ చర్చకు పిలిస్తే.. ఆళ్లగడ్డకు పోలీసులను పంపారని మండిపడ్డారు. కుందు ప్రాంతంలో ఇళ్లు కట్టుకుని నువ్వు, నీ తండ్రి నివసించగలరా.. అలాంటి ప్రాంతంలో పట్టాలిస్తావా అని అఖిలప్రియ ధ్వజమెత్తారు.

నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శిల్పా రవి అహంకారంతో విర్రవీగిపోతున్నారని ఎద్దేవా చేశారు. బహిరంగ చర్చకు పిలిస్తే.. ఆళ్లగడ్డకు పోలీసులను పంపారని మండిపడ్డారు. టీడీపీలో ఏ నేతను సెలక్ట్ చేసుకున్నా పర్లేదని, చర్చకు రెడీ అంటూ అఖిలప్రియ సవాల్ విసిరారు. అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా అని ఆమె ప్రశ్నించారు. మీ భూముల రేట్లు పెంచుకోవడానికి బొగ్గు లైన్ వాసులను రోడ్డుపాలు చేస్తావా అని అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుందు ప్రాంతంలో ఇళ్లు కట్టుకుని నువ్వు, నీ తండ్రి నివసించగలరా.. అలాంటి ప్రాంతంలో పట్టాలిస్తావా అని అఖిలప్రియ ధ్వజమెత్తారు.
అంతకుముందు నిన్న భూమా అఖిల ప్రియ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పథకాలేవి ఎన్నికల్లో పనిచేయవన్నారు. చంద్రబాబును జైలుకు పంపినందుకు ప్రజలే వైసీపీకి బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు రూ.300 కోట్లు కాదు కదా.. రూ.3 కూడా తీసుకుని వుండరని భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఓటర్ల జాబితా పరిశీలన ప్రారంభమయ్యాకే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించారు. ప్రజలకు రూ. 100 ఇచ్చి .. రెండు వందలు దోచుకుంటున్నారని అఖిలప్రియ దుయ్యబట్టారు. ఈసారి జగన్ సీఎం అయితే ఏపీ మరో బీహార్ అవుతుందని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.