రౌడీయిజానికి, ఫ్యాక్షన్‌కు తేడా తెలియదు.. ఆయన అసలు పేరు సింగారెడ్డి : శిల్పా రవికి అఖిలప్రియ కౌంటర్
తనపై వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. శిల్పా రవికి రౌడీయిజానికి, ఫ్యాక్షనిజానికి తేడా తెలియదని అఖిలప్రియ దుయ్యబట్టారు. ప్రజలను తాము మోసం చేయలేదని, దమ్ముంటే ఎన్నికలకు రావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు.

తనపై వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనను భూమా అఖిలప్రియ కాదు, మద్దూరు అఖిలప్రియ అన్నారట అంటూ మండిపడ్డారు. తన పేరు మారితే తాను మారనని, అది తన వ్యక్తిత్వమని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఆయన అసలు పేరు సింగారెడ్డి అని.. శిల్పా రవి అని ఎందుకు అంటున్నారని ఆమె సెటైర్లు వేశారు.
గాంధీ చౌక్‌కు రాకుండా అడ్డుకుని ఏదో సాధించామని అనుకుంటున్నారని.. శిల్పా రవికి రౌడీయిజానికి, ఫ్యాక్షనిజానికి తేడా తెలియదని అఖిలప్రియ దుయ్యబట్టారు. శిల్పా రవి గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కందుకూరులో 200 ఎకరాలు వుందన్న శిల్పా రవి ఆధారాలు చూపాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. విజయ డైరీలో రూ.కోటి తీసుకున్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తాము మోసం చేయలేదని, దమ్ముంటే ఎన్నికలకు రావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు.
అంతకుముందు అఖిలప్రియపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రా రెడ్డి. తాను భూ కుంభకోణాలకు పాల్పడినట్టుగా నమ్మించే ప్రయత్నం చేస్తుందని ఆయన చెప్పారు. అఖిలప్రియ చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ ఆస్తి విలువ పెరిగితే ఆమెకు ఎందుకు ఈర్ష్య అని నంద్యాల ఎమ్మెల్యే ప్రశ్నించారు.ఆళ్లగడ్డలోని కందుకూరులో భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిలు 200 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. అతి తక్కువ ధరకు ఈ భూములు కొనుగోలు చేశారని శిల్పా రవి వివరించారు.
ALso REad: మా ఆస్తుల విలువ పెరిగితే ఈర్ష్య ఎందుకు?: భూమా అఖిలప్రియjకు శిల్పా రవి కౌంటర్
ఈ ఆస్తి విలువ భారీగా పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అయితే మీ ఆస్తి విలువ పెరిగినందుకు తాము బాధపడడం లేదన్నారు. తన ఆస్తిపై మీరు ఏడవడం ఎందుకో అర్ధం కావడం లేదంటూ శిల్పా రవి చురకలంటించారు. వ్యాపారం చేసి తాము ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా శిల్పారవి తెలిపారు. తాము వ్యాపారం చేస్తే భూమా అఖిలప్రియ ఎందుకు ఈర్ష్యపడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. మెడికల్ కాలేజీ వస్తుందని 50 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారని తనపై భూమా అఖిలప్రియ చేసిన ఆరోపణలపై కూడా శిల్పా రవి స్పందించారు. తమకు 30 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. మిగిలిన 20 ఎకరాలు ఎవరైనా తీసుకువచ్చని ఆయన స్పష్టం చేశారు.
50 ఎకరాలు కమర్షియల్ చేశారన్నది అవాస్తవమని నంద్యాల ఎమ్మెల్యే చెప్పారు. తమకు ఉన్న 30 ఎకరాలు కూడా ఒకే దగ్గర లేదన్నారు. తన తండ్రి గతంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ను కూడా చెక్ చేసుకువచ్చని శిల్పా రవి సవాల్ విసిరారు. హైద్రాబాద్ లో డెవలప్ అయ్యే ప్రాంతాల్లో తాము భూముల కొనుగోలు చేసినట్టుగా శిల్పా రవి తెలిపారు. అఖిలప్రియ తీరు హస్యాస్పదంగా ఉందని శిల్పా రవి విమర్శించారు. ఎదుటి వారిపై ఈర్ష్య పడే కంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన హితవు పలికారు.