గుంటూరు: అధికార పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి మధ్య ట్విట్టర్ వార్ సాగుతోంది. యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా వైసిపి ప్రభుత్వం పెట్టుబడులను, కంపనీలను రాష్ట్రానికి తీసుకువస్తోందన్న విజయసాయి మాటలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు అయ్యన్నపాత్రుడు.

''వందల కోట్ల దుబారాతో పార్టనర్ షిప్ సమ్మిట్ లు, దావొస్ లో రోడ్ షోలు, ప్రచార ఆర్భాటాలు లేవు. సీఎం జగన్ గారి విశ్వసనీయతే ప్రామాణికంగా రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఇకపై ఉపాధి కోసం యువత బయటకు వెళ్లే అవసరమే ఉండదు'' అని విజయసాయి ట్వీట్ చేశారు.

''యువత సంగతి తరువాత,నీకు జ్వరం వస్తేనే పక్క రాష్ట్రానికి పారిపోయావ్ మార్చిపోయావా, మతిమరుపు విజయసాయి రెడ్డి?18 నుంచి 35 ఏళ్ళ వయసు గల యువతలో ఫైర్ ఉంటుంది. దాన్ని ఎలా ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఎలా వాడుకోవాలో తెలియకుండా, వాలంటీర్ ఉద్యోగాలు,తోపుడు బళ్ళు, జగనన్న సారాయి దుకాణాల్లో ఉద్యోగులుగా పెట్టి, యువతను నిర్వీర్యం చేసేస్తున్నారు. ఈ 18 నెలల్లో వెళ్ళిపోయిన కంపెనీల లిస్టు, 200 దాటింది, వచ్చిన కంపెనీ ఒక్కటి లేదు. చంద్రబాబు గారి కృషితో, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో, ఎన్ని పెట్టుబడులు వచ్చయో మీ మంత్రే అసెంబ్లీలో చెప్పాడు, చూడు'' అంటూ అదే ట్విట్టర్ వేదికన అయ్యన్న కౌంటరిచ్చారు. 
 
''అయినా పెట్టుబడులు గురించి నువ్వు మాట్లాడటం ఏమిటి ?వైజాగ్ లో పులివెందుల ముఠాని దించి, ఎంత మంది పెట్టుబడిదారులను హింసిస్తున్నావో, ఎన్ని కంపెనీలు మీ పులివెందుల పంచాయతీ తట్టుకోలేక పారిపోయారు, అందరికీ తెలిసిందేగా'' అంటూ మరో ట్వీట్ ద్వారా సీఎం జగన్ ను ఎద్దేవా చేశారు. 

''జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిన వారు మధ్యలోనే పోయిన మాట వాస్తవమే వీసా రెడ్డి.పోలవరంలో అవినీతి కాల్వలు తవ్వి, ఆర్ అండ్ ఆర్ గాలికొదిలేసిన దౌర్భాగ్యం మహామేతది. నీటి నిల్వ సామర్ధ్యాన్ని 41.15 మీటర్లుకు కుదించి ఉత్తరాంధ్ర, రాయలసీమ కి అన్యాయం చేస్తుంది యువమేత. 45.72 మీటర్ల ఎత్తులో 194 టిఎంసిల నీరు నిల్వ చేసి ప్రాజెక్టుని పూర్తిస్థాయిలో వినియోగానికి తీసుకువస్తాం అని చెప్పే దమ్ము సీఎం జగన్ కి ఉందా ఎంపీ విజయసాయి రెడ్డి?'' అని అయ్యన్న నిలదీశారు.