విశాఖపట్నం: పుదుచ్చెరి ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో అధికార పార్టీ బిజెపి ఇచ్చిన ఓ హామీ ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఎన్నికల్లో బిజెపి గెలిస్తే పుదుచ్చెరికి ప్రత్యేక హోదా ఇస్తామన్నహామీయే ఏపీలో వైసిపి, బిజెపిలను ఇరకాటంలో పెట్టింది. ఈ విషయంపై తాజాగా సోషల్ మీడియా వేదికన స్పందిస్తూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసిపి, సీఎం జగన్ పై సెటైర్లు విసిరారు. 

''ఒక పక్క బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదు అంటుంది. మరో పక్క పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టింది. మన మెడలు వంచే ఉస్తాద్ ఈ పరిస్థితిలో ఏమి చేయాలి? ఏపి ప్రజల తరుపున పోరాటం చేయాలి. కానీ అదే పుదుచ్చేరిలో ఎన్డీఏకి మద్దతుగా, తన మంత్రులను, ఎంపీలను పంపించాడు వైఎస్ జగన్'' అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు.  
 
''మన హక్కుగా రావాల్సిన స్పెషల్ స్టేటస్ అడిగే ధైర్యం లేక పోగా, స్పెషల్ స్టేటస్ ఇస్తామంటున్న ఎన్డీఏ తరుపున పుదుచ్చేరిలో ప్రచారం చేస్తున్న ఈ వైసీపీ వారిని ఏమనాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహులు అనేది వీరికి చాలా చిన్న పదం.'' అంటూ అయ్యన్న మండిపడ్డారు. 

ఇదే విషయంపై మరో మాజీ మంత్రి లోకేష్ కూడా స్పందించారు. ''మోదీ మెడ ‌వంచి తెస్తాన‌న్న ప్ర‌త్యేక‌హోదాని తాక‌ట్టు పెట్టిన ఫేక్ సీఎం గారూ! ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెష‌ల్ స్టేట‌స్ ఇస్తామంటోంది. ఏపీకి ముగిసిన అధ్యాయ‌మైన ప్ర‌త్యేక‌హోదా పుదుచ్చేరిలో ఎలా మొద‌ల‌వుతుందో?'' అంటూ ట్విట్టర్ వేదికన లోకేష్ ప్రశ్నించారు.
 
''రాష్ట్రంలో క‌మ‌లంతో ర‌హ‌స్య ప్ర‌యాణాన్ని క‌ట్టిపెట్టేసి పుదుచ్చేరిలో బీజేపీ మిత్రుల గెలుపు కోసం వైకాపా నాయకులతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు వైఎస్ జగన్.. మీ కేసుల గురించి కాకుండా కాస్తా ప్ర‌త్యేక‌హోదా కోసం ఇప్ప‌టికైనా గ‌ట్టిగా అడ‌గండి'' అని లోకేష్ సూచించారు.