Asianet News TeluguAsianet News Telugu

అర్థరాత్రి దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడ్డారు.. కనీసం దుస్తులు మార్చుకోనివ్వకుండా లాక్కెళ్లారు: అయ్యన్న సతీమణి

టీపీడీ  సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నంలో గురువారం వేకువ జామున భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం నోటీసులు అందజేసి.. ఆయనను  అరెస్టు చేశారు. 

Tdp Leader Ayyannapatrudu Arrested Midnight In Narsipatnam
Author
First Published Nov 3, 2022, 9:30 AM IST

టీపీడీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నంలో ఆయన నివాసాన్ని గురువారం వేకువ జామున భారీ ఎత్తున పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం 
ఆయనకు నోటీసులిచ్చి అదుపులోకి తీసుకున్నారు. క్రైం నంబర్ 64/2022 లో ఐపిసీ సెక్షన్లు 464,467, 471, 474, 120బి కింద అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫోర్జరీ పత్రాలను ఇచ్చాడనే అభియోగాలపై ఆయనను అరెస్టు చేసి.. తీసుకున్నట్లు చెబుతున్నారు. అలాగే.. ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అయ్యన్నపాత్రుడు ఉండగా.. రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ పేర్లను కేసులో నమోదు చేశారు. వారిని ఏలూరు కోర్టులో ప్రవేశపెడుతామని పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. కానీ అయ్యన్న పాత్రుడిని మాత్రం విశాఖ ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించారు. అయితే.. విచారణ అనంతర ఆయను  ఏలూరు కోర్టుకు తీసుకెళ్తారా? లేక విశాఖలోనే కోర్టులోనే ప్రవేశపెడతారా అనే విషయం మాత్రం తెలియరాలేదు. 

ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి అరెస్టుపై ఆయన సతీమణి పద్మావతి స్పందించారు. అర్థరాత్రి దౌర్జన్యంగా ఇంట్లో చొరబడి అరెస్టు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి దారుణాలు చేయలేదని, తమపై పోలీసులు, ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రవర్తించడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బట్టలు మార్చుకొనివ్వకుండా, కాళ్లకు చెప్పులు వేసుకోనివ్వకుండా తన భర్తను పోలీసులు తోసుకుంటూ లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. గత  మూడేండ్లుగా తమ కుటుంబాన్నివేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అరెస్టు చేయడానికి వచ్చిన కొంతమంది పోలీసులు అమర్యాద ప్రవర్తించారనీ, అందులో కొంత మంది మద్యం సేవించి వచ్చారని, తన భర్త(అయ్యన్న)కు ప్రాణ హాని ఉందని పద్మావతి ఆరోపించారు. తనకు, తమ కుటుంబానికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. 

మరోవైపు.. అయ్యన్న అరెస్ట్‌తో  నర్సీపట్నంలో నిరసన ర్యాలీ చేపట్టారు టీడీపీ శ్రేణులు.తన నాయకుడిని  వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో  పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయ్యన్న పాత్రుడి అరెస్టును ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తితో పాటు పలువురు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు.

Follow Us:
Download App:
  • android
  • ios