చంద్రబాబు అరెస్ట్ పెద్ద తప్పు .. జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారు : అయ్యన్నపాత్రుడు హెచ్చరిక
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులోనూ చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని అయ్యన్నపాత్రుడు ఆకాంక్షించారు. వైఎస్ జగన్‌ను భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు తిరిగి జనంలోకి వెళతారని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
అంతకుముందు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాజమండ్రిలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. బెయిల్‌పై బయటకు వచ్చేటప్పుడు కూడా ఆంక్షలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. జైలుకు 3 కిలోమీటర్ల దూరంలోనూ బారికేడ్లు పెట్టడం దారుణమని .. జైలు వద్దకు రాకుండా టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడం సరికాదన్నారు.
Also Read: Chandrababu: చంద్రబాబుకు బెయిల్ ..కండిషన్స్ ఇవే !!
ఇకపోతే.. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబు విజయవాడ చేరుకోనున్నారు. అనంతరం రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబు చికిత్స తీసుకోనున్నారు.
అంతకుముందు చంద్రబాబు చర్య, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని.. అలాగే ఆయన కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు అభిమానులు, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.