ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు వైసీపీ యత్నం.. రేపో, ఎల్లుండో అవినాష్ రెడ్డి అరెస్ట్: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ జగన్‌కు అలవాటేనని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో శాడిస్ట్ ముఖ్యమంత్రి ఉన్నాడని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ జగన్‌కు అలవాటేనని అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి దృష్టి మళ్లించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఎన్నిక కూడా సక్రమంగా జరగలేదని విమర్శించారు. శాసనమండలి ఎన్నికల్లో కూడా అక్రమంగా గెలిచేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
పట్టభద్రలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విపరీతమైన దొంగ ఓట్లు చేర్పించారని అన్నారు. దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్‌ను కలుస్తామని, న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఓటు వేసేవాళ్లే కాకుండా వాళ్లకు గెజిటెడ్ సంతకాలు పెట్టినవాళ్లు కూడా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం టీచర్లకు, నిరుద్యోగులకు వైసీపీ నేతలు రూ. 5 వేలు ఫోన్ పే చేస్తున్నారని ఆరోపించారు.
ఓ వైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేస్తారన్న పరిస్థితులు.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మరో వైపు ఉందని అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో రేపో, ఎల్లుండో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవుతారని జోస్యం చెప్పారు.