ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పోలీసులు జైలు నుంచి రమేశ్ ఆసుపత్రికి తరలించారు. ఎస్కార్ట్ మధ్య అంబులెన్స్ వాహనం ద్వారా ఆయనను అక్కడికి తీసుకెళ్లారు.

జ్యూడీషియన్ కస్టడీలో అచ్చెన్నాయుడు ఉన్నందున రమేశ్ ఆసుపత్రి వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయనను పరామర్శించేందుకు ఎవరూ వెళ్లకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. 

Also Read:హైకోర్టులో ఊరట: రమేష్ ఆస్పత్రికి అచ్చెన్న, ప్రభుత్వ లాయర్ అభ్యంతరం

ఈ నెల 1వ తేదీన జీజీహెచ్ ఆసుపత్రి నుండి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేశారు. వెంటనే అతడిని గుంటూరు జైలుకు తరలించారు. తన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో తనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అచ్చెన్నాయుడు ఈ నెల 2వ తేదీన ఏపీ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై ఈ నెల 3వ తేదీన ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ  విషయమై హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో హైకోర్టులో అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై కూడ కోర్టులో ఇరువైపులా వాదనలు పూర్తైన విషయం తెలిసిందే.